Begin typing your search above and press return to search.

కరకట్టపై వెయిటింగ్.. కడుపుమంటతో వెనక్కి!

By:  Tupaki Desk   |   12 March 2018 3:55 AM GMT
కరకట్టపై వెయిటింగ్.. కడుపుమంటతో వెనక్కి!
X
ఎవ్వరూ బయటపడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు గానీ.. చంద్రబాబు మీద ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లో విపరీతమైన ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు దళిత వ్యతిరేకి అనే మాటలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. దళిత వర్గానికి చెందిన నాయకుడిని కొన్నేళ్లుగా పార్టీ అవసరాలకోసం ఎడాపెడా వాడుకుని.. పదవి ఇస్తామని ఆశ చూపించి, చివరిక్షణంలో మోసం చేస్తారా? అంటూ.. పార్టీలోని దళిత నాయకులు విరుచుకుపడుతున్నారు. వర్ల రామయ్యకు టిక్కెట్ చివరి క్షణంలో నిరాకరించడం అనేది ఇతర కులాలకు చెందిన సాధారణ కార్యకర్తలకు కూడా మింగుడుపడని - అసంతృప్తి కలిగిస్తున్న అంశంగానే ఉంది.

వర్ల రామయ్యకు టిక్కెట్ నిరాకరించడం అనే పర్వం కూడా చాలా నాటకీయంగా - సినిమాటిక్ గా జరిగింది. వర్ల రామయ్య పేరును చంద్రబాబు నాయుడు ఖరారు చేసేశారు. ఆయనకు ఎంపీ పదవి దక్కినట్టుగా చంద్రబాబు తప్ప.. ఆయన కోటరీలోని కొందరు ముఖ్యులు వర్లకు శనివారం నాడే ఫోను చేసి.. కంగ్రాట్స్ కూడా చెప్పేశారు. నిజానికి శనివారం నాడు ఫైనల్ గా మూడుపేర్లు ప్రస్తావనకు వచ్చినప్పుడు... చంద్రబాబు బీద మస్తాన్ రావు పేరును డిలిట్ చేశారు. ఈ సమయంలో ఆయనకు ఇవ్వడం కుదరదని చెప్పేశారు. దీంతో వర్లకు కబురు వెళ్లిపోయింది.

ఆదివారం తెల్లారే సరికి - పచ్చ మీడియాలో వర్లకు కన్ఫర్మ్ అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. టీవీల్లో స్క్రోలింగులు వచ్చేశాయి. ఆయన టీవీ మీడియాతో.. తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పేసుకున్నారు. ఇక చంద్రబాబునాయుడు నుంచి కబురు వస్తుంది.. ఉండవిల్లి వెళ్లి ఆయనను కలిసి ధన్యవాదాలు చెప్పాలి.. అని రెడీ అయిపోయి.. ఇంట్లో సిద్ధంగా కూర్చున్నారు.

ఎదరుచూస్తున్నారు కానీ ఫోను రాలేదు. చివరకు ఇంట్లోంచి బయల్దేరిపోయి.. చంద్రబాబు ఇంటివైపుగా వెళ్తూ.. కృష్ణానది కరకట్టపై ఆగారు. కారు అక్కడే నిలబెట్టుకుని కొంతసేపు నిరీక్షించారు. పిలుపు వస్తే వెళ్దాం అని ఎదురుచూశారు. తీరా ఆయన కట్టమీద ఉండగానే.. పుట్టి మునిగిపోయిన వార్త వచ్చింది. రెండో సీటుకు కనకమేడలను ఎంపిక చేసినట్లు కబురు తెలిసింది. ఆయన నిరాశ పడ్డారు.

నిస్పృహతో కడుపుమంటతో కరకట్ట మీదినుంచే వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత యధావిధిగా చంద్రబాబు నిర్ణయం శిరోధార్యం అంటూ ఒక స్టేట్ మెంట్ పడేశారు.. అంతే!!