Begin typing your search above and press return to search.

జగన్ కి హిందీ ఇంగ్లిష్ రాదట

By:  Tupaki Desk   |   16 Nov 2021 5:43 AM GMT
జగన్ కి హిందీ ఇంగ్లిష్ రాదట
X
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని టీడీపీ టార్గెట్ చేసినట్లుంది. లేకపోతే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తాజాగా చేసిన కామెంట్లే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. సజ్జలను వర్ల నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆయనేమన్నా మంత్రా ? ఆయేనమన్నా ఎంఎల్ఏనా ? అంటు ఎగిరిపడ్డారు. మంత్రులు, ఎంఎల్ఏలు మాట్లాడకుండా అంతా సజ్జలే మాట్లాడటం ఏమిటి ? అంటు వర్ల ఊగిపోయారు.

నిజానికి సజ్జలపై వర్ల మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రభుత్వం తరపున కానీ లేదా పార్టీ తరపున కానీ ఎవరు మీడియాతో మాట్లాడాలి అనేది పూర్తిగా వాళ్ళ అంతర్గత విషయం. సజ్జల మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారమే జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి జగన్ మీడియాతో మాట్లాడలేరని, తెలుగు, ఇంగ్లీషు కూడా రాదని, చదువుకోలేదంటు వర్ల నోటికొచ్చింది మాట్లాడారు.

అంటే జగన్ మీద టీడీపీకి ఎంత కసుందో వర్ల తాజా వ్యాఖ్యలతో అర్ధమైపోతోంది. సీఎం జగన్ కు తెలుగు, ఇంగ్లీషు మాట్లాడటం వచ్చా రాదా అన్నది అప్రస్తుతం. చంద్రబాబు కన్నా ఇంగ్లీషు వైఎస్ జగన్ చక్కగానే మాట్లాడుతారని ఇప్పటికే నిరూపితమైంది. అలాగే హిందీని కూడా వైఎస్ జగన్ చక్కగా మాట్లాడగలరని వర్ల మరచిపోయినట్లున్నారు. మొదటి నుంచి కూడా మీడియాకు జగన్ చాలా దూరంగా ఉంటారని తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా జగన్ మీడియాకు దూరంగానే ఉన్నారు.

మీడియాకు జగన్ ఎందుకు దూరంగా ఉంటారంటే దానివల్లే ఎక్కువ నష్టమని జగన్ నమ్ముతారు. చంద్రబాబునాయుడు లాగానో లేకపోతే టీడీపీ నేతల లాగానో ప్రతిరోజు మీడియాలో కనబడాలనే ప్రచారయావ వైఎస్ జగన్ కు లేదు. అందుకనే మీడియా ముందుకు మంత్రులో లేకపోతే సజ్జలో వస్తున్నారంతే. ఇంకా విచిత్రమేమంటే ఇంకోసారి సజ్జల మీడియాతో మాట్లాడితే కోర్టుకు వెళతానని వర్ల బెదిరించటం.

అయినా ప్రభుత్వం తరపున వాదన ఎవరు వినిపిస్తే ప్రతిపక్షం టీడీపీకి ఎందుకు ? తమ హయాంలో మీడియా సలహాదారుగా పనిచేసిన పరకాల ప్రభాకర్ కూడా ఎన్నోసార్లు మీడియా సమావేశాలు నిర్వహించిన విషయం టీడీపీ మరచిపోయిందేమో. దేశంలో సంచలనం సృష్టించిన ‘ఓటుకునోటు’ ఎపిసోడు మొత్తం పరకాలే మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. కాబట్టి అనవసరమైన విషయాల మీద మాట్లాడటం కాకుండా పార్టీకి ఉపయోగపడేట్లుగా వర్ల పనిచేస్తే బాగుంటుంది.