Begin typing your search above and press return to search.

బలం లేని చోట దళితుడే దొరికాడ బాబు

By:  Tupaki Desk   |   11 March 2020 6:10 AM GMT
బలం లేని చోట దళితుడే దొరికాడ బాబు
X
ప్రస్తుతం చంద్రబాబు వైఖరిపై దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బలం లేకున్నప్పుడు ఇప్పుడు దళితులను బరిలోకి దించాలని నిర్ణయించడం ఆ చంద్రబాబు వైఖరి ఎలాంటిదో స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు వచ్చాయి. లెక్కలు పరిశీలిస్తే ఆ నాలుగు స్థానాలు వైఎస్సార్సీపీనే సొంతం చేసుకోనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఫలితాలు పొందడంతో ఇప్పుడు టీడీపీ బలం ఏమాత్రం లేదు. అయినా ఈ సమయంలో రాజ్యసభకు పోటీకి దిగాలనుకోవడం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి.

పైగా టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యను ఎంపిక చేశారు. ఎలాగో ఓడిపోతామని తెలిసీ కూడా వర్ల రామయ్యను ఎంపిక చేయడమంటే దళితులను అవమానించడమేనని చర్చ సాగుతోంది. ఇన్నాళ్లు అధికారం లో ఉన్నప్పుడు ఒక్క దళిత నాయకుడికి రాజ్యసభకు పంపని చంద్రబాబు నాయుడు ఇప్పుడు బలం లేని సమయంలో పోటీకి దింపడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్‌ పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన విషయాన్ని కూడా ఇప్పుడు గుర్తుచేస్తున్నారు.

ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున వర్ల రామయ్యను పోటీకి బరిలో నిలపడంతో మరోసారి ఆ సామాజిక వర్గాన్ని మోసం చేసే కుట్రలో భాగమేనన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం లేకపోవడంతో వర్ల రామయ్యను చంద్రబాబు పోటీకి దించారని చర్చ సాగుతోంది. గెలిచే అవకాశం ఉన్నప్పుడు దళితులకు రాజ్యసభ సీటు ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు వారికి అవకాశం ఇవ్వడం సరికాదని పేర్కొంటున్నారు.