Begin typing your search above and press return to search.

వర్ల అతితెలివి ని చూసి నవ్వుకుంటున్నారట

By:  Tupaki Desk   |   26 Nov 2019 12:41 PM GMT
వర్ల అతితెలివి ని చూసి నవ్వుకుంటున్నారట
X
కాలం చెల్లిన ఐడియాలతో రాజకీయాలు చేసే తెలుగు తమ్ముళ్లు తరచూ అభాసుపాలవుతుంటారు. వారి చేష్టలపై తరచూ విమర్శలు వెల్లువెత్తుతూ ఉంటాయి. తమనంతా చాలా సులువుగా ఎలా కార్నర్ చేస్తారంటూ అమాయకంగా ప్రశ్నిస్తుంటారు. తాజాగా వర్ల రామయ్య ఎపిసోడ్ చూస్తే అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది. తమ పాలనలో అవినీతికి అవకాశం లేదని.. ఎక్కడైనా అవినీతి జరిగితే ఫిర్యాదులు చేయటానికి వీలుగా ఏపీ సర్కార్ 14400 టోల్ ఫ్రీ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు.

అయితే.. దీన్ని దుర్వినియోగం చేసేలా ఈ టోల్ ఫ్రీ నెంబరుకు వర్ల ఫోన్ చేసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించారని జగన్ మీద రొడ్డు కొట్టుడు బురద జల్లిన ఆయన.. జగన్ అవినీతి మీద అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు.

తానిచ్చిన ఫిర్యాదును సచివాలయానికి తీసుకెళ్లి అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బందికి సూచించారు. సీఎం ప్రకటించినట్లుగాతన ఫిర్యాదు మీద కూడా 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలన్నారు. వర్ల మర్చిపోతున్న పాయింట్ ఏమంటే.. ఇలాంటి ఆరోపణలు పెద్ద ఎత్తున గుప్పించిన తర్వాతే.. ఏపీ ప్రజలు 151 సీట్లతో అపూర్వమైన విజయాన్ని అందించి జగన్ ను ముఖ్యమంత్రిని చేశారన్నది మర్చిపోకూడదు.

అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేధింపులకు గురి చేయాలన్న లక్ష్యంతో నాటి ప్రభుత్వం పెట్టిన కేసులపై ప్రజాతీర్పు ఎన్నికల్లో వచ్చేసిన విషయాన్ని వదిలేసిన వర్ల.. తాజాగా చేసిన చేష్ట ఆయన్ను అభాసుపాలు చేయటమే కాదు.. ఇలాంటి అతి తెలివి తెలుగు తమ్ముళ్లకు మాత్రమే సాధ్యమన్న వ్యంగ్యస్త్రాల్ని పలువురు సంధిస్తున్నారు. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలంటే సరైన అంశాల్ని తెర మీదకు తీసుకురావాలే కానీ.. ఇలా పిల్లలాట మాదిరి చేసుడేంది వర్ల?