Begin typing your search above and press return to search.

మోడీ మనసు దోచుకోవటానికి ఇంటి పరువు తీశారే?

By:  Tupaki Desk   |   8 April 2019 10:54 AM GMT
మోడీ మనసు దోచుకోవటానికి ఇంటి పరువు తీశారే?
X
రాజకీయ ప్రయోజనాలు తాత్కాలికమైనవి. కానీ.. అలాంటి వాటి కోసం కొన్ని వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. కానీ.. గాంధీ ట్యాగ్ తో బీజేపీలో ఉంటూ.. కీలక స్థానాన్ని చేజిక్కించుకోవటానికి ఎంతో కాలంగా చకోర పక్షిలా ఎదురుచూస్తున్న వరుణ్ గాంధీ.. ఎవరూ ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేసి షాకిచ్చారు. మోడీ మనసును దోచుకోవటానికి ఇంతకు మించిన మంచి సమయం ఉండదని అనుకున్నారో ఏమో కానీ.. ఆయన నోటి నుంచి ఊహించని రీతిలో వ్యాఖ్యలు వచ్చాయి.

మోడీ పని తీరును ప్రశంసించటానికి.. ఆయన్ను ఆకాశానికి ఎత్తేయటానికి తన కుటుంబం నుంచి వచ్చిన ప్రధానమంత్రుల్ని సైతం తక్కువ చేయటానికి వెనుకాడని వరుణ్ గాంధీ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పెద్ద కొడుకు కొడుకైన వరుణ్ గాంధీ బీజేపీలో ఉండటం తెలిసిందే. బీజేపీలో తనకు గౌరవ స్థానాన్ని కోరుకుంటున్న ఆయన కల ఇప్పటివరకూ ఫలించలేదు.

కీలకమైన ఎన్నికల వేళ.. తన ఇంటి పేరు ప్రఖ్యాతుల్ని పక్కన పెట్టేసి.. తన రాజకీయ ప్రయోజనమే ముఖ్యమని భావించారో ఏమో కానీ.. తన ఇంటి నుంచి ఎన్నికైన ప్రధానుల కంటే మోడీయే దేశానికి ఎక్కువ పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టారని వ్యాఖ్యానించేందుకు వెనుకాడలేదు. మోడీ దేశం కోసమే జీవిస్తున్నారని.. దేశం కోసమే మరణిస్తారని వ్యాఖ్యానించారు. మోడీ తన తుదిశ్వాస వీడే వరకూ దేశం కోసమే ఆలోచిస్తారని అభిప్రాయపడ్డారు.

బీజేపీ వ్యవస్థాపకుడు.. మోడీకి గురువైన అద్వానీనే మోడీపై సుతిమెత్తటి విమర్శలు చేసిన వేళ.. ఆ మరక చెరిగిపోయేలా.. మొనగాడి ఇమేజ్ ను కట్టబెట్టేందుకు వరుణ్ గాంధీ నెహ్రు.. ఇందిర.. రాజీవ్ గాంధీల కంటే మెరుగైన ప్రధానిగా కీర్తించటం విశేషం.

వాజ్ పేయ్.. మోడీ పేద కుటుంబాల నుంచి వచ్చారని.. వారెప్పుడు అవినీతికి పాల్పడలేదన్న వరుణ్ గాంధీ.. గత ఐదేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదన్నారు. ఆయనకుసొంత కుటుంబమే లేనప్పుడు.. ఎవరి కోసం అవినీతికి పాల్పడతారని ప్రశ్నించారు. ఇటీవల వరుణ్ తల్లి మేనకాగాంధీ మాట్లాడుతూ.. అద్భుతం జరిగితే తప్పించి రాహుల్ ప్రధానమంత్రి కాలేరని వ్యాఖ్యానించగా.. వరుణ్ మరో అడుగుముందుకేసీ.. ఏకంగా తన ఇంటి నుంచి వచ్చిన ప్రధానుల కంటే మోడీనే మెరుగైన ప్రధాని అని కీర్తించటం గమనార్హం.