Begin typing your search above and press return to search.

కమ్మలపై వైసీపీ ఎమ్మెల్యే తండ్రి హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   21 Nov 2022 6:30 AM GMT
కమ్మలపై వైసీపీ ఎమ్మెల్యే తండ్రి హాట్‌ కామెంట్స్‌!
X
కమ్మ సామాజికవర్గంపై ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తండ్రి వసంత నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నందిగామ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.. వసంత నాగేశ్వరరావు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోం శాఖ మంత్రిగానూ పనిచేశారు.

తాజాగా ఆయన జగ్గయ్యపేటలో జరిగిన కమ్మ వన సమారాధాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమ్మలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కమ్మ మంత్రి కూడా లేరని గుర్తు చేశారు. ఏపీలో కంటే తెలంగాణలోనే కమ్మలకు మంచి ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు. తెలంగాణ కేబినెట్‌లో కమ్మ మంత్రి ఒకరు ఉన్నారని.. ఏపీలో ఒక్కరు కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. అన్ని పార్టీల తరఫున దాదాపు 20 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఒక్కరికీ కూడా మంత్రి పదవి లేకపోవడం విచారకరమన్నారు.

ఎన్టీఆర్‌ యూనివర్సిటీకి పేరు మార్చినా ప్రశ్నించలేని స్థితిలో ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మ సామాజికవర్గంపై రాజకీయంగా దాడి చేస్తున్నా ఎందుకు స్పందిచడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో వివిధ సంస్థల పేర్లన్నీ నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డిలతోనే ఉన్నాయన్నారు. వీటిని ఏ ప్రభుత్వాలు మార్చలేదన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి మాత్రం పేరు మార్చార న్నారు.

కమ్మలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ వేరే వర్గం ఎమ్మెల్యేలున్నారని వసంత నాగేశ్వరరావు గుర్తు చేశారు. సొంత కులాన్ని వదిలేసి వేరే సామాజికవర్గాల పల్లకీలు మోయడం సరికాదన్నారు.

వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. విజయవాడలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ అని పేరు మార్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ వైసీపీలో ఉన్న కమ్మ ఎమ్మెల్యేలెవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు..

మరోవైపు జగన్‌ తొలి మంత్రివర్గ విస్తరణలో కమ్మ సామాజికవర్గం నుంచి కొడాలి నానికి మంత్రి పదవి లభించింది. అయితే రెండో మంత్రివర్గ విస్తరణలో కొడాలి నానికి జగన్‌ ఉద్వాసన పలికారు. కమ్మ సామాజికవర్గానికే చెందిన కొఠారు అబ్బయ్య చౌదరి, వసంత కృష్ణప్రసాద్‌ల్లో ఒకరికి మంత్రి పదవి వస్తుందని వార్తలు వచ్చినా ఎవరికీ ఇవ్వలేదు.

ప్రస్తుతం జగన్‌ కేబినెట్‌లో ఒక్క కమ్మ ఎమ్మెల్యే కూడా లేకపోవడం గమనార్హం. అలాగే ఎలాంటి కీలక పదవుల్లోనూ ఈ సామాజికవర్గానికి చెందినవారు ఒక్కరు కూడా లేరు. ఈ నేపథ్యంలోనే వసంత నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెబుతున్నారు.

కాగా తన తండ్రి వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది. 2019 ఎన్నికల ముందు తన తండ్రితోపాటు వైసీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌ తొలిసారి మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావుపై గెలుపొందారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.