Begin typing your search above and press return to search.

వైసీపీకి సామాన్యుడే 'కోహినూర్':వాసిరెడ్డి ప‌ద్మ‌

By:  Tupaki Desk   |   13 July 2017 11:12 AM GMT
వైసీపీకి సామాన్యుడే కోహినూర్:వాసిరెడ్డి ప‌ద్మ‌
X
ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడుపై వైసీపీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ మండి ప‌డ్డారు. చంద్ర‌బాబు మెద‌డును వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌ న‌వ‌ర‌త్నాలు తొలిచేస్తున్నాయ‌న్నారు. అందుకే ఆయ‌న‌కు నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని విమ‌ర్శించారు. గ‌త ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్రెస్ మీట్ పెట్టి చ‌దివే ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా? అని ప‌ద్మ ప్ర‌శ్నించారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్లీన‌రీలో జగన్‌ ప్రకటించిన నవరత్నాల గురించే రాష్ట్రమంత‌టా చ‌ర్చ జ‌రుగుతోంద‌ని, ఆ ప‌థాకాల చ‌ర్చ‌ను పక్కదోవ పట్టించడానికే అసెంబ్లీ - హైకోర్టు కొత్త 'కోహినూర్' డిజైన్లను చంద్ర‌బాబు విడుదల చేశారని చెప్పారు. ఆయ‌న‌కు ఎప్పుడు బూస్టింగ్ అవ‌స‌ర‌మైతే అపుడు కొత్త డిజైన్లు విడుద‌ల చేయ‌డం అల‌వాటుగా మారింద‌న్నారు. మూడేళ్లుగా వివిధ దేశాల గ్రాఫిక్స్‌ డిజైన్లను చూసి జ‌నం విసిగి పోయార‌న్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన చిన్న హామీలే నెర‌వేర‌లేద‌ని, రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమ‌వుతుందో చెప్పాల‌న్నారు.

మ‌నం చేయ‌లేని వాటిని గ్రాఫిక్స్ లో చూపిస్తుంటామ‌ని, అందుకే చంద్ర‌బాబు రాజ‌ధానిని కేవ‌లం గ్రాఫిక్స్ ల‌తో మాత్ర‌మే ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్నారు. చివ‌రికి ఈ కోహినూర్ డిజైన్ లో అయినా పైన‌ల్ అవుతుందో? లేదో? తెలియ‌ద‌న్నారు. యనమల రామకృష్ణుడు దొడ్డిదారిలో ఆర్థిక మంత్రి అయ్యార‌ని, ఆయ‌న‌కు ప్రజల కష్టాలు తెలియ‌వ‌న్నారు. య‌నమలకు చంద్రబాబుకు చెంచాగిరి చేయడంలోనే స‌మ‌యం సరిపోతోంద‌న్నారు.

య‌న‌మ‌ల వయసులో పెద్దవారు కానీ మాటల్లో పెద్దరికం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయడానికి కారణం యనమలే. జగన్‌ ప్రకటించిన నవరత్నాలను గులకరాళ్లతో పోల్చడం సరికాద‌ని అన్నారు. త‌మ‌కు సామాన్యుడే నవరత్నాలని, వారి కోసమే నవరత్నాల హామీలని ఆమె తెలిపారు.

రాష్ట్రంలో భూకుంభ‌కోణాల‌కు, అవినీతికి పాల్ప‌డుతున్న టీడీపీ నేత‌ల‌కు న‌వ‌ర‌త్నాలు గుల‌క‌రాళ్ల‌లానే క‌న‌బ‌డ‌తాయ‌న్నారు. సింగ‌పూర్ సంస్థ‌ల‌కు అమ‌రావ‌తి భూముల‌ను ధారాదత్తం చేయడం మాత్ర‌మే టీడీపీకి క‌నిపిస్తోంద‌ని ప‌ద్మ ఎద్దేవా చేశారు. న‌వ‌ర‌త్నాలు సామాన్యుడి జీవ‌నాడి అని ప‌ద్మ అన్నారు.నవరత్నాలపై ప్ర‌జ‌లంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంటే, వాట‌ని హేళన చేయడానికి టీడీపీ నేతలకు మనసు ఎలా వచ్చిందని ఆమె ప్ర‌శ్నించారు. రాజధాని డిజైన్ల‌పై ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తే నిర్మాణానికి ప్రతిపక్షం అడ్డుపడుతుందని ఎదురుదాడి చేస్తున్నార‌న్నారు. ప్రతిపక్షం అడ్డుకుంటుందని చెప్పడం ప్రభుత్వం చేతకానితనం తప్ప మరొకటి కాదు. మాకు సామాన్యుడే నవరత్నం, అతడే కోహినూర్‌ వజ్రం’ అని వాసిరెడ్డి పద్మ అన్నారు.