Begin typing your search above and press return to search.

ఏం బాబు.. వాసిరెడ్డి వారు చెప్పింది విన్నారా?

By:  Tupaki Desk   |   18 Oct 2016 5:33 PM GMT
ఏం బాబు.. వాసిరెడ్డి వారు చెప్పింది విన్నారా?
X
ఏదైనాపాయింట్ దొరికితే చాలు.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీడియా ముందుకు వచ్చేసే నేతల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాసిరెడ్డి పద్మ ఒకరు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విమర్శ చేసే ఏ చిన్న అవకాశం వచ్చినా ఆమె వదిలిపెట్టరు. ఒకవేళ.. ఆమె వదిలిపెడితే.. ఆ అవకాశాన్ని పార్టీలోని ఆర్కే రోజా ఎక్కడ కొట్టికెళ్లిపోతారో అన్నట్లుగా చాలా జాగ్రత్తగా ఉండటం కనిపిస్తుంది. తాజాగా ఆమె మరోసారి గళం విప్పారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు నోరు జారి.. నిరుద్యోగ భృతి గురించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆ సువర్ణావకాశాన్ని ఆమె మిస్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు లేరు.

సార్వత్రిక ఎన్నికల వేళ.. ఇంటికో జాబు ఇస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు.. అదే సమయంలో నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారని.. కానీ.. ఆ హామీని నెరవేర్చమని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన విషయాన్ని గుర్తుచేసిన ఆమె.. ఎన్నికల ప్రణాళిక సైతం పార్టీ నిరుద్యోగభృతి హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రులు మతిమరుపు వ్యాధితో బాధ పడుతున్నారంటూ ఆమె ఎద్దేవా చేయటం గమనార్హం.

మతిమరుపు వ్యాధితో బాధ పడుతున్న మంత్రులు.. ఎన్నికల వేళ తమ అధినేత ఇచ్చిన హామీల్ని మర్చిపోతున్నట్లుగా ఉందన్నారు. ఇటీవల టీడీపీ వెబ్ సైట్ నుంచి 2014 ఎన్నికల హామీని తొలగించారని.. సోషల్ మీడియాలో సైతం ఎన్నికల ప్రణాళికను తీసేసినట్లుగా ఆమె ఆరోపించారు. ఎన్నికల హమీలను ఆన్ లైన్ లో తొలగించినా.. ప్రజల హృదయాల నుంచి తొలగించలేరంటూ వ్యాఖ్యానించారు.

ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ప్రకారం.. లక్షా పదిహేను వేల కోట్ల రూపాయిల మేర నిరుద్యోగులకు భృతి కింద చెల్లించాల్సి ఉందన్న ఆమె.. బాబు చెప్పిన ప్రకారం ప్రతి ఇంటికి రూ.58వేల బాబుసర్కారు బకాయిలు ఉందన్న విషయాన్ని వెల్లడించారు. అచ్చెన్నాయుడు అన్న ఒక్క నిరుద్యోగ భృతి మాటతో ఫుల్ క్లాస్ తీసుకున్న వాసిరెడ్డి వారి నోటి ధాటికి బ్రేకులు వేస్తూ.. సమర్థవంతంగా కౌంటర్ ఇచ్చే తెలుగు తమ్ముళ్లు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/