Begin typing your search above and press return to search.

పార్లమెంటుకు కరోనా అంటించిన సింగర్?

By:  Tupaki Desk   |   20 March 2020 1:43 PM GMT
పార్లమెంటుకు కరోనా అంటించిన సింగర్?
X
కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచదేశాలు వణికిపోతున్న సంగతి తెలిసిందే. భారత్ లోనూ కరోనా పాజిటివ్ కేసులు 200కు చేరువ కావడంతో అన్ని రాష్ట్రాలు అప్రత్తమయ్యాయి. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని చెబుతోన్న పొలిటిషన్స్ కూ కరోనా సెగ తాకింది. ఏకంగా ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి జయప్రతాప్ సింగ్ స్వయంగా క్వారంటైన్ విధించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనతోపాటు రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే - ఆమె కుమారుడు - బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ కరోనా అనుమానంతో సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు. పార్లమెంటులో దుష్యంత్ పక్కన కూర్చున్న టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్‌ కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకున్నారు. అంతేకాదు, ప్రజలంతా సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాలని పిలుపునిచ్చిన ప్రధాని...పార్లమెంటు ఎందుకు కొనసాగిస్తున్నారంటూ డెరెక్ ప్రశ్నించారు. కరోనా పాజిటివ్ అని తేలిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ తోపాటు దుష్యంత్ - వసుంధరా రాజే ఓ పార్టీకి హాజరవడంతో వారు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు.

కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిని ఎయిర్ పోర్టుల్లోనే క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే, బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ కూ లండన్ నుంచి వచ్చిన తర్వాత తనిఖీ జరిపిన తర్వాత పంపించారు. ఆ తర్వాత లక్నోలో జరిగిన ఓ పార్టీకి రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే - ఆమె కుమారుడు - బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ - యూపీ ఆరోగ్య మంత్రి జయప్రతాప్ సింగ్ ఆయన సన్నిహిత బంధువులతో పాటు కనికా కపూర్ హాజరయ్యారు. ఆ పార్టీకి హాజరైన తర్వాత కనికాకపూర్‌ కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. దీంతో, కనికాతోపాటు ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ - వసుంధరా రాజే కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకున్దునారు. అయితే, దుష్యంత్‌ - వసుంధరల కరోనా టెస్ట్ రిజల్ట్ ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

మరోవైపు, దుష్యంత్ లోక్‌ సభ సమావేశాలకు హాజరైన నేపథ్యంలో పార్లమెంటులో ఆయన సమీపంలోనే కూర్చునే టీఎంసీ ఎంపీ డెరెక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనతోపాటు మరో ఇద్దరు ఎంపీలు సెల్ఫ్‌ క్వారంటైన్‌లొ ఉన్నారని డెరెక్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికైనా పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ను డెరెక్ కలవడం మరింత కలకలం రేపుతోంది. వీరితోపాటు పార్లమెంటు ఆవరణలోపోలీసు అధికారుల, ఇతర సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఆందోళన చెందుతున్నారు.