Begin typing your search above and press return to search.

వాసుపల్లి ఝలక్ : వైసీపీకి గుడ్ బై కొట్టనున్న టీడీపీ ఎమ్మెల్యే... ?

By:  Tupaki Desk   |   5 Jun 2022 12:30 AM GMT
వాసుపల్లి ఝలక్ : వైసీపీకి గుడ్ బై కొట్టనున్న టీడీపీ ఎమ్మెల్యే... ?
X
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ కండువా కప్పుకుని రెండేళ్ళు అయింది. ఆయన ఫ్యాన్ నీడన ఇంతకాలం సేదతీరుతూ వచ్చారు. అయితే గత కొన్ని నెలలుగా ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోంది. అధినాయకత్వం తనను పట్టించుకోవడం లేదన్న బాధ, వ్యధ వాసుపల్లిలో ఉన్నాయి. అంతే కాదు సౌత్ వైసీపీలో ఉన్నన్ని గ్రూపులు మరెక్కడా లేవు. దాంతో ఆ వర్గాలతో వాసుపల్లి అసలు ఏ కోశానా పడలేకపోతున్నారు.

ఇది చాలదన్నట్లుగా కొత్తగా బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ అయిన వైసీపీ సీతం రాజు సుధాకర్ విశాఖ దక్షిణంలో కాలూ వేలూ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే వైసీపీ తరఫున అభ్యర్ధిని అని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన సొంతంగా గడగగడపకు మన సర్కార్ పేరిట కార్యక్రమాన్ని చేపడుతూ ఎమ్మెల్యే వాసుపల్లికి పోటీగా వస్తున్నారు.

దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన ఫస్ట్ మీటింగులోనే వాసుపల్లి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీలో వర్గాలు ఉన్నాయని, తనని పనిచేసుకోనీయడం లేదని మొరపెట్టుకున్నారు.

అయినా పార్టీలోనూ దక్షిణ నియోజకవర్గాన పెద్దగా మార్పు లేకపోవడంతో ఆయన తాజాగా వైవీ సుబ్బారెడ్డి విశాఖ టూర్ లో ఝలక్ ఇచ్చేశారు. తనకు పార్టీ ఇచ్చిన నియోజకవర్గ సమన్యవ కర్త పదవికి రాజీనామ చేస్తూ ఆ లేఖను నేరుగా సుబ్బారెడ్డికి పంపించి షాక్ ఇచ్చేశారు.

దీంతో వాసుపల్లికి వైసీపీతో బంధం తెగిపోయినట్లు అయింది. ఆయన ఇపుడు ఫ్రీ బర్డ్ అంటున్నారు. ఆయన తొందరలోనే వైసీపీకి గుడ్ బై కొడుతున్నట్లుగా ప్రకటన కూడా చేస్తారని తెలుస్తోంది. ఆయన అడుగులు ఇపుడు టీడీపీ వైపు వేగంగా పడుతున్నాయి. టీడీపీలోనే పుట్టి పెరిగిన వాసుపల్లి 2020 మార్చి నెలలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా విశాఖ వచ్చినపుడు ఆయన ప్రసంగం చేసిన ప్రదేశం ఆయన రాకతో కలుషితం అయిందని పసుపు నీళ్ళు చల్లి కడిగిన వాసుపల్లి కరడుకట్టిన టీడీపీ కార్యకర్తగా ఉండేవారు.

విశాఖ పార్టీలో ఆయన ఫైర్ బ్రాండ్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. జగన్ మీద ఎవరూ అననన్ని మాటలు అన్న వాసుపల్లి సడెన్ గా వైసీపీ కండువా కప్పుకోవడమే వింత అయితే ఇపుడు ఆ పార్టీని వీడడం మరో విడ్డూరం. మొత్తానికి చాలా కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ వాసుపల్లి వైసీపీకి దూరం జరిగారు.

వైసీపీకి విశాఖ సిటీలో ఎక్కడా గెలిచిన సీట్లు లేవు. ఇక టీడిపీ నుంచి వచ్చిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే వాసుపల్లిని పార్టీ పట్టించుకోలేదని, ఆయన్ని సరిగ్గా ఆదరించి పార్టీలో ఉంచుకోలేకపోయిందని అంటున్నారు. ఇక సౌత్ లో చూస్తే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కూడా సరైన అభ్యర్ధులు లేరనే అంటున్నారు. ఇక ఈ సీటు మీద ఆశలు వదిలేసుకోవాలనే చెబుతున్నారు.