Begin typing your search above and press return to search.

వాసుపల్లి గీతోపదేశం : వైసీపీ ప్లీనరీలో అసంతృప్తి గళం

By:  Tupaki Desk   |   1 July 2022 4:35 AM GMT
వాసుపల్లి గీతోపదేశం : వైసీపీ ప్లీనరీలో అసంతృప్తి గళం
X
ఆయన మాటలు పదునుగా ఉంటాయి. చెప్పే విషయం సూటిగా ఉంటుంది. అందుకే ఆయనను క్యాడర్ మెచ్చుకుంటుంది. లీడర్స్ అయితే కాస్తా నొచ్చుకుంటారు. ఆయనే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన వైసీపీ జిల్లా ప్లీనరీలో జగన్ని పొగుడుతూనే పార్టీలో లోపాలను కూడా మరో వైపు ఏకరువు పెట్టారు. అది కూడా ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఎదుటనే ఆయన తన అసంతృప్తి గళాన్ని విప్పారు.

పార్టీలో పనిచేసే వారుని గుర్తించండి సారూ, పైరవీకారులను బాగా పక్కనపెట్టండి మహానుభావా అంటూ వేడుకున్నారు. దానికి గానూ వాసుపల్లి ఉపయోగించిన మాటలు ఆసక్తిని రేకెత్తించాయి. లాగే గురాలు ఎవరికైనా కావాలి కానీ తన్నే గుర్రాలుఅవసరమా అని ఆయన పెద్దాయనను డైరెక్ట్ గానే ప్రశ్నించారు. లాగే గుర్రమేదో తెలుసుకోండి అని వాసుపల్లి వైవీ కి గీతోపదేశమే చేశారు.

మొత్తానికి పార్టీ బాగుండాలంటే పనిచేసే వారే ముఖ్యమని, ఆడంబరాలు చేసేవారు కానే కాదని వాసుపల్లి చెప్పాల్సింది చెప్పేశారు. విశాఖ సౌత్ లో షో చేసేవారు ఎక్కువ అయ్యారని, తనను పనిచేసుకోనీయడం లేదని, వారిని కట్టడి చేయాలని వాసుపల్లి ఆవేదన వెనక అంతరార్ధం అని చెబుతున్నారు. ఈ మధ్యనే ఆయన వైసీపీ పోకడల పట్ల అసంతృప్తి చెంది తనకు నియోజకవర్గం ఇంచార్జి పదవి వద్దని చెప్పేసి రాజీనామా కూడా చేశారు.

అయితే వెంటనే రంగంలోకి దిగిన వైవీ సుబ్బారెడ్డి ఆయనకు నచ్చచెప్పి ఒప్పించారు. అయినా సౌత్ లో సీన్ లో పెద్దగా మార్పు లేదని వాసుపల్లి తాజా కామెంట్స్ బట్టి తెలుస్తోంది. మరి వైసీపీలో చూస్తే తన్నే గుర్రాలే చలామణీలో ఉన్నాయని పార్టీ వాదులు కూడా అంటున్నారు. వాసుపల్లి ప్లీనరీ వేదికగా చెప్పాల్సింది బాగానే చెప్పారని, ఇక మంచి చెడులు చూసుకుని పార్టీని గాడిన పెట్టుకోవడం పెద్దల ఇష్టమని అంటున్నారు.