Begin typing your search above and press return to search.

బాబుతో కాంగ్రెస్ పొత్తు..పార్టీకి ముఖ్య‌నేత గుడ్ బై

By:  Tupaki Desk   |   2 Nov 2018 4:22 AM GMT
బాబుతో కాంగ్రెస్ పొత్తు..పార్టీకి ముఖ్య‌నేత గుడ్ బై
X
కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మావేశం అవ‌డం ద్వారా బీజేపీ ఏతర పార్టీలను కూడగట్టి జాతీయ స్థాయిలో మహాకూటమికి పావులు కదుపుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్ర‌క‌టించికుంటుంటే...మ‌రోవైపు ఈ భేటీకి సంబంధించిన సైడె ఎఫెక్ట్స్‌ తెర‌మీద‌కు వ‌స్తున్నాయి!కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ టీడీపీతో కలవడాన్ని నిరసిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు వసంత్ కుమార్ స్పష్టం చేశారు. వసంత్ కుమార్ తన రాజీనామా లేఖను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి - కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మెయిల్ ద్వారా పంపనున్నట్లు సమాచారం. వట్టి రాజీనామా చేసినట్లు తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే ప్రయత్నం అంటూ ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు సమావేశమై రాజకీయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట్నుంచి కాంగ్రెస్-టీడీపీ కలిస్తే పార్టీకి దూరమవుతామని చెబుతున్న నేతలు రాజీనామా బాట పడుతున్నారు. తాజాగా రాహుల్ - చంద్రబాబు కలయిక నచ్చని కారణంగానే వట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్‌ కు గుడ్ బై చెప్పారు. తాను 1983 నుంచి టీడీపీతో పోరాడుతున్నానని.. అలాంటి పార్టీతో కాంగ్రెస్ కలవడం జీర్ణించుకోలేకపోతున్నట్టు వట్టి వసంత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం వసంత్ కుమార్ ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మరికొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం వట్టి బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

కాగా, ఈ ఎపిసోడ్ కాంగ్రెస్ నేత‌ల‌ను షాక్‌ కు గురిచేస్తోంద‌ని తెలుస్తోంది. అయితే, వ‌ట్టి భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. వసంత్ కుమార్ జనసేన లేదా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే త్వరలోనే తన అనుచరులు - ముఖ్య కార్యకర్తలతో మాట్లాడిన వట్టి వసంత్ కుమార్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని సమాచారం.