Begin typing your search above and press return to search.

రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేశారంట!

By:  Tupaki Desk   |   9 Sept 2017 2:15 PM IST
రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేశారంట!
X
దేశంలోనే పేరొందిన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్ లో గతేడాది రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పొదిలి అప్పారావు - అప్పటి కేంద్ర మంత్రి.. ప్రస్తుత మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ - అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ - తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు - అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడు సుశీల్ పైన ఆరోపణలు వ్యక్తమవడం.. దేశవ్యాప్తంగా దీనిపై విద్యార్థులు రోడ్డు ఎక్కడం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?.. తాజాగా నిన్నవీసీ అప్పారావు ఒక టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. రోహిత్ ఆత్మహత్యతోపాటు వివిధ అంశాలపైన తన అభిప్రాయాలు పంచుకున్నఆయన కొన్నివిషయాలపై వింత ధోరణిలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంపై యూపీఏ తీవ్ర అసహనంతో ఉందని.. ‘ఎవడు వీడు.. వీడెందుకు అసలు వచ్చాడు. మనం ఇన్నేళ్లు పాలించాం కదా.. ’ అని ప్రభుత్వంపైన అసహనంతో రగిలిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

రోహిత్ వేముల ఆత్మహత్యను ప్రతిపక్షాలు రాజకీయం చేశాయని అందుకనే పెద్ద ఇష్యూ అయిందని కూడా ఆయన సెలవిచ్చారు. అంతేకాకుండా ఒక పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ.. ప్రత్యేక విమానం వేసుకుని మరీ హైదరాబాద్ యూనివర్శిటీకి రావాల్సిన అవసరం ఏంటని ఇప్పుడు తీరిగ్గా ప్రశ్నిస్తున్నారు. దీనికి దేశానికి రాహుల్‌ సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. తనకేమీ ఆరెస్సెస్ - బీజేపీ భావజాలాలు లేవనీ - గతంలో కూడా ఏ పార్టీకి పనిచేయలేదంటూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.