Begin typing your search above and press return to search.

వీణా..వాణిలను ఆస్ట్రేలియా డాక్టర్లు వేరు చేస్తారట

By:  Tupaki Desk   |   10 July 2016 5:22 AM GMT
వీణా..వాణిలను ఆస్ట్రేలియా డాక్టర్లు వేరు చేస్తారట
X
అవిభక్త కవలలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో ముద్రపడిపోయిన వీణా.. వాణి ఎపిసోడ్ ఒక కొలిక్కి రాకపోవటం తెలిసిందే. ప్రభుత్వాల నిర్లక్ష్యం.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటంలో పడిన తప్పటడుగులు విషయాన్ని ఇక్కడి వరకూ తీసుకొచ్చాయి. కాలంతో పాటు పెరుగుతున్న ఈ అవిభక్త కవలల్ని విడదీయటానికి కష్టసాధ్యంగా మారుతున్న సంగతి తెలిసిందే. వీరికి ఆపరేషన్ నిర్వహించేందుకు ఎయిమ్స్ వైద్యులు చేతులు ఎత్తేయటంతో వీణా.. వాణిల భవితవ్యం సందేహాల్లో పడింది. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వాన్ని నిందించే పరిస్థితి.

గత ప్రభుత్వాల మాదిరి వీణా.. వాణిలను వదిలేయాలన్న ఆలోచనలో తాము లేమన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి తన తాజా వ్యాఖ్యతో చెప్పకనే చెప్పేశారు. ఆపరేషన్ కు ఎంత ఖర్చు అయినా తాము భరిస్తామని.. అవిభక్త కవలల్ని విడదీయాలన్నదే తప్పించి ఖర్చు గురించి పట్టించుకోమని స్పష్టం చేశారు. తాజాగా వీరిద్దరిని విడదీసేందుకు ఆస్ట్రేలియా వైద్య బృందం ఒకటి తమను సంప్రదించిందని.. వీణా..వాణిలను పరీక్షించి వారి అభిప్రాయం చెప్పిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

పిల్లలు పెద్దవారు అవుతున్న నేపథ్యంలో వారిని నిలోఫర్ ఆసుపత్రిలో ఉంచటం సరికాదన్న భావనతో వారిని స్టేట్ హోంకు తరలిస్తున్నట్లు చెప్పిన లక్ష్మారెడ్డి.. ఆసుపత్రిలో మాదిరే అన్ని వసతుల్ని వారికి స్టేట్ హోంలో కల్పిస్తామని చెప్పారు. ఆస్ట్రేలియా వైద్య బృందం పుణ్యమా అని వీణా.. వాణిలు ఎలాంటి ప్రమాదం లేకుండా విడిపోతే అంతకు మించిన ఆనందకరమైన విషయం తెలుగు ప్రజలకు ఉండదనే చెప్పాలి.