Begin typing your search above and press return to search.

కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం!

By:  Tupaki Desk   |   22 Nov 2021 10:33 AM GMT
కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం!
X
భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం వీరచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారత సైన్యంలో సేవలందిస్తున్న అభినందన్, బాలాకోట్ వైమానిక దాడుల్లో పాక్ సైన్యంతో వీరోచితంగా పోరాడారు. అభినందన్‌ కు వీరచక్ర ప్రదానం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వెలువడింది.

పాకిస్తానీ వాయు చొరబాట్లను నిరోధించినందుకు అతనికి గతంలో శౌర్య చక్ర అవార్డు లభించింది. అభినందనలతో పాటు, సప్పర్ ప్రకాష్ జాదవ్‌కు మరణానంతరం కీర్తి చక్ర లభించింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్‌లో ఆయన పాత్రకు గానూ ఈ అవార్డు లభించింది.

బాలాకోట్ మెరుపు దాడుల సమయంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత్ వైపు దూసుకు వస్తుంటే కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ సమర్థవంతంగా వాటిని నిలువరించగలిగాడు. ఆ యుద్ధ విమానాలను తరుముతూ శత్రు దేశంలోకి వెళ్లాడు. అక్కడే ఎఫ్-16ను నేలమట్టం చేశాడు.

ఆయన విమానం కూడా దెబ్బతినడంతో ప్యారాచూట్ సహాయంతో అదే దేశంలో దిగాడు. 2019 ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భారత సైనికులపై ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్తాన్‌ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సూసైడ్ బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడు.

అనంతరం జైషే మహ్మద్ ఈ దాడికి బాధ్యతనూ ప్రకటించింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. జైషే మహ్మద్ ఉగ్రశిబిరాలున్న పాకిస్తాన్‌లో బాలాకోట్‌లోని ఖైబర్ పక్తుంక్వా కనుమలలో భారత వాయు దళం ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది.

భారత వైమానిక దళ మెరుపు దాడుల తర్వాతి రోజు పాకిస్తాన్ నుంచీ సుమారు 24 యుద్ధ విమానాలు భారత సరిహద్దు వైపునకు బయల్దేరాయి. ఎల్‌వోసీ దాటి భారత గగనతలంలోకి వచ్చాయి. భారత దేశ భూభాగంలో బాంబులు వేశాయి. ఇది గమనించి భారత వైమానిక దళం కూడా ఎదురెళ్లింది.

అవి వెనుదిరిగాయి. ఓ ఎఫ్-16 విమానాన్ని టార్గెట్ చేసిన కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ దాన్ని తరుముకుంటూ వెళ్లాడు. అలా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాడు. అంతేకాదు, ఆ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చాడు. అయితే, కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ విమానం కూడా దెబ్బతిన్నది.

దీంతో ఆయన ప్యారాచూట్ సహాయంతో పాకిస్తాన్ భూభాగంలో దిగాడు. అక్కడి స్థానికులు ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ అధికారులు ఆయనను బంధించారు.కానీ, భారత దౌత్య అధికారులు ఒత్తిడి తేవడంతో పాకిస్తాన్ అభినందన్ వర్ధమాన్‌ను విడిచిపెట్టడానికే నిర్ణయించుకుంది.

ఆయన టీ తాగుతూ కనిపించిన వీడియోను పాకిస్తాన్ విడుదల చేసింది. ఆ తర్వాత శాంతి సూచకంగా తాము అభినందన్ వర్ధమాన్‌ను భారత్‌ కు అప్పగించాలని భావిస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అనంతరం ఆయనను వాగా అట్టారి సరిహద్దులో భారత అధికారులకు అప్పగించారు. అనంతరం ఆయన ఎప్పటిలాగే విధుల్లో చేరారు. ఈ ఘటన తర్వాత వింగ్ కమాండర్ స్థాయి నుంచి పదోన్నతి కల్పించి గ్రూప్ కమాండర్‌ గా ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన వైమానిక దళంలో గ్రూప్ కమాండర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.