Begin typing your search above and press return to search.

తెలుగునేతల్లారా మొయిలీని చూసి సిగ్గు తెచ్చుకోండి

By:  Tupaki Desk   |   17 March 2015 4:53 AM GMT
తెలుగునేతల్లారా మొయిలీని చూసి సిగ్గు తెచ్చుకోండి
X
తెలుగు ప్రాంతాల నేతలు సిగ్గు తెచ్చుకోవాల్సిన సంఘటన మరోసారి ఎదురైంది. తమ ప్రాంతాల ప్రయోజనాల కోసం పార్టీని సైతం ధిక్కరించటం.. అధినేత్రి మాటను సైతం పట్టించుకోకపోవటం లాంటి వాటిని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. అధినాయకత్వానికి సన్నిహితుడైన వీరప్పమొయిలీ మరోసారి చేతల్లో చేసి చూపించారు.

రాష్ట్ర విభజన సమయంలో తెలుగు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు వ్యవహరించిన వైఖరి చూసినప్పుడు.. అధినాయకత్వానికి భజన చేయటమే తప్ప.. తమ ప్రాంతాల ప్రయోజనాలు పెద్దగా పట్టింది లేదనుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమదే క్రెడిట్‌ అన్నది చెప్పుకోవటానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు పడిన ఉత్సాహం.. విభజన బిల్లులో తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లే అంశాలపై వారు దృష్టి పెట్టలేదు.

అదే సమయంలో సీమాంధ్ర నేతల పరిస్థితి మరింత దారుణం. విభజన నిర్ణయం వల్ల తమ ప్రాంతం తీవ్రమైన నష్టానికి గురి అవుతుందని.. ఈ కారణంగా రాష్ట్రం దాదాపు పాతికేళ్ల వెనక్కి వెళుతుందని.. విభజన అన్నది జరిగితే భవిష్యత్తు తరాలు తీవ్రస్థాయిలో నష్టపోతాయన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తమ ప్రాంత ప్రయోజనాల కంటే కూడా తమ వ్యక్తిగత లాభాలు చూసుకోవటం.. లెక్కలేసుకోవటంలో మునిగిపోయారు.

ఇలా ఎవరికి వారు తమ ప్రయోజనాలు తప్పించి వ్యవహరించిన వారే కానీ.. తెలుగు ప్రాంత ప్రయోజనాల గురించి పట్టించుకున్నది లేదు. ఒక్క విభజన సందర్భంలోనే కాదు. కాంగ్రెస్‌ పార్టీ పాలించిన పదేళ్ల కాలంలో.. ఏపీ నేతలు ఏ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం సీరియస్‌గా ప్రయత్నించింది లేదు. నాటి యూపీఏ 1.. యూపీఏ 2లకు ప్రాణధారమైన మెజార్టీ మొత్తం ఏపీ నుంచే ఉన్నా.. ఏపీ పట్ల పెద్దగా పట్టని ధోరణితో వ్యవహరించే అధినాయకత్వ తీరును ప్రశ్నించింది లేదు.

తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదన్న విషయంపై బలంగా తమ వాదనను వినిపించిన నాయకుడు ఒక్కడంటే.. ఒక్కరు కూడా లేరనే చెప్పాలి. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీనే తీసుకోండి. ఏపీకి.. తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించేలా నిర్ణయాలు తీసుకోవటం కుదరదని రాజ్యసభలోనే వ్యాఖ్యానించారు.

విభజన సందర్భంగా నాటి కేంద్రం ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని.. ఆ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదంటూ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియమ్మ స్వయంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. అదేమీ పట్టని మొయిలీ తాజాగా తన వాదనను వినిపించేశారు.

మొయిలీ మాటల్ని చూస్తే.. తాను ప్రాతినిధ్యం వహించే కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేశారే తప్పించి.. మరే విషయాల్ని పట్టించుకోలేదు. తాము అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల కారణంగా బలి అయిపోయిన ఏపీకి సంబంధించి.. మొయిలీ లాంటి వారికి కించిత్‌ బాధ కూడా లేకపోవటాన్ని చూశాక అయినా తెలుగునేతలు సిగ్గు తెచ్చుకొని తమ ప్రాంతాల ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తన రాష్ట్ర ప్రయోజనాల కోసం.. చివరకు పార్టీ అధినేత్రి వాణిని సైతం లెక్క చేయని మొయిలీ తెగింపును మెచ్చుకుందామా?.. ఇలాంటి తెగింపు లేని తెలుగు నేతల్ని చూసి సిగ్గు పడదామా?