Begin typing your search above and press return to search.

మొయిలీ ట్వీట్ కాంగ్రెస్ లో బాంబులా పేలిందే

By:  Tupaki Desk   |   16 March 2018 8:02 AM GMT
మొయిలీ ట్వీట్ కాంగ్రెస్ లో బాంబులా పేలిందే
X
ఒక్క ట్వీట్ ఎంత ర‌చ్చ చేస్తుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సోష‌ల్ మీడియా విస్తృతి అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ‌.. వివాదాస్ప‌ద అంశాలు ఎంత‌గా వైర‌ల్ అవుతాయో.. ఆయా ప్ర‌ముఖుల‌కు ఎంత‌టి త‌ల‌నొప్పులు తీసుకొస్తాయో తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ.. సీనియ‌ర్ నేత అయిన వీర‌ప్ప మొయిలీ చేసిన‌ట్లుగా చెబుతున్న ట్వీట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బాంబులా పేలింది.

క‌ర్ణాట‌క రాష్ట్ర అసెంబ్లీకి త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న వేళ‌.. పార్టీ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసే ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల‌ను కోట్లాది రూపాయిల‌కు అమ్ముకుంటున్నారంటూ వీర‌ప్ప మొయిలీ ట్వీట్ చేశార‌ని చెబుతున్న ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఈ ట్వీట్ ను కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి ట్యాగ్ చేయ‌టం ఒక ఎత్తు అయితే.. మొయిలీ చేసిన‌ట్లు చెబుతున్న ట్వీట్ కు ఆయ‌న కుమారుడు రీట్వీట్ చేయ‌టం మ‌రో సంచ‌ల‌నంగా మారింది. రాజ‌కీయాల్లో ధ‌న బ‌లం పెరిగిపోయింద‌ని.. కోట్లాది రూపాయిలు ఇస్తున్న కాంట్రాక్ట‌ర్ల‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్లు విక్ర‌యిస్తున్న‌ట్లుగా మొయిలీ ట్వీట్ ఆరోపించింది. తాను చెబుతున్న విష‌యాల‌పై పార్టీ ఆరా తీయాల‌ని ట్వీట్ చేయ‌గా.. ఆయ‌న ట్వీట్ల‌ను ఆయ‌న కుమారుడు హ‌ర్షా మొయిలీ సైతం రీట్వీట్ చేయ‌టంతో కాంగ్రెస్‌ లో ఈ వ్య‌వ‌హారం పెను సంచ‌ల‌నంగా మారింది.

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. టికెట్లు అమ్ముకుంటున్నార‌న్న పేరు ప్ర‌ఖ్యాతుల‌తో లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చి పెడ‌తాయ‌ని కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్యానిస్తున్న‌రు. సీనియ‌ర్ నేత అయి ఉండి. .అధినాయ‌క‌త్వంతో మంచి సంబంధాలు ఉన్న మొయిలీ లాంటోళ్లు ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేయ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ లోక‌ల‌క‌లం రేపిన ట్వీట్ తాను చేసింది కాద‌ని.. తాను..త‌న కుమారుడు ట్వీట్స్ చేయ‌లేద‌ని.. అవెలా వ‌చ్చాయో అర్థం కావ‌టం లేదని వీర‌ప్ప మొయిలీ చెబుతున్నారు.

మొయిలీ.. ఆయ‌న కుమారుడు ట్వీట్ చేయ‌కుండానే ఎలా వ‌స్తాయ‌న్న‌ది ఓప‌క్క సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత‌కీ ఈ ర‌చ్చ అంతా ఎందుకు అంటే.. క‌ర్ణాట‌కలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న హెచ్ సి. మ‌హ‌దేవ‌ప్ప‌.. మ‌రికొంద‌రు కాంట్రాక్ట‌ర్ల మ‌ధ్య పార్టీ టికెట్లు ఇప్పించేందుకు ఒప్పందం జ‌రుగుతుంద‌న్న‌ది మొయిలీ ట్వీట్ వెల్ల‌డించింది. అధిష్ఠానానికి విష‌యాన్ని చేర‌వేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్న‌ప్పుడు ట్వీట్ల‌తో ఎందుకు వెల్ల‌డించార‌న్న‌ది పెద్ద సందేహంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాము ఎలాంటి ట్వీట్లు చేయ‌లేద‌ని పేర్కొన్న వీర‌ప్ప మొయిలీ.. ఆయ‌న కుమారుడి మాట‌లు ఇప్పుడు కొత్త ప్ర‌శ్న‌ల‌కు తెర తీస్తున్నాయి. వారి అనుమ‌తి లేకుండా వారి ట్విట్ట‌ర్ ఖాతాల్లో ఎలా పోస్ట్ చేస్తార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.