Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ తమ్ముడిని సైడ్ చేస్తున్నారా...?

By:  Tupaki Desk   |   16 Jan 2022 2:30 AM GMT
హ్యాట్రిక్  తమ్ముడిని సైడ్ చేస్తున్నారా...?
X
రాజకీయాల్లో మార్పులే ఎపుడూ సరికొత్త వ్యూహాలను రచిస్తాయి. జనాల మూడ్ ఎపుడూ మారుతుంది. దానికి తగినట్లుగానే మార్పుచేర్పులు చేసుకున్న వారే విజయాలను అందుకుంటారు. ఆ సూత్రాన్ని టీడీపీ ఈసారి గట్టిగా వంటబట్టించుకుంటుంది అంటున్నారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే పాతకాపులకు, సీనియర్లకు ఝలక్ ఇచ్చే ప్లాన్ లో టీడీపీ ఉంది అంటున్నారు.

విశాఖ అర్బన్ లో తూర్పు నియోజకవర్గంలో ఈసారి భారీ మార్పులు ఉంటాయని టాక్ అయితే నడుస్తోంది. 2009లో అసెంబ్లీ పునర్విభజన తరువాత విశాఖ తూర్పు ఏర్పాటు అయింది. నాడు విశాఖలో లిక్కర్ బిజినెస్ చేసుకుంటూ టీడీపీకి వీరాభిమానిగా ఉన్న విజయవాడ వాసి, విశాఖకు వలస వచ్చిన నాయకుడు అయిన వెలగపూడి రామక్రిష్ణబాబుకు టికెట్ ని టీడీపీ ఇచ్చింది.

అప్పట్లో ఒక వైపు వైఎస్సార్ చరిష్మా, మరో వైపు కొత్త పార్టీ ప్రజారాజ్యం, చిరంజీవి గ్లామర్ ఉన్నా కూడా మూడు వేల ఓట్ల తేడాతో వెలగపూడి ఆ రెండు పార్టీల మీద గెలిచి సత్తా చాటారు. దాంతో ఆయనకు చంద్రబాబు వద్ద మంచి గుర్తింపు లభించింది. ఇక 2014 నాటికి టీడీపీకి అనుకూల పవనాలు పెద్ద ఎత్తున వీచడంతో ఏపీలోనే రెండవ అతి పెద్ద మెజారిటీగా విశాఖ తూర్పుని నిలబెట్టారు రామక్రిష్ణబాబు.

ఇక 2019 ఎన్నికల్లో అయితే జగన్ సునామీని సైతం తట్టుకుని పాతిక వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా మూడు దఫాలుగా గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టిన వెలగపూడికి భారీ షాక్ గత ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో తగిలింది. జీవీఎంసీ ఎన్నికల్లో మెజారిటీ కార్పోరేటర్లను వైసీపీ గెలుచుకుంది. దాంతో టీడీపీ పట్టు మెల్లగా జారుతోంది అని ఎమ్మెల్యేతో పాటు అధినాయకత్వం కూడా గుర్తించింది.

దీనితో పాటు వెలగపూడి మీద వచ్చిన కొన్ని భూ వివాదాలకు సంబంధించిన ఆరోపణలను వైసీపీ జనం ముందు పెట్టి అప్పట్లో బదనాం చేసింది. వచ్చే ఎన్నికల్లో ఆయన్ని ఓడించి తీరుతామని అంటోంది. ఇక్కడ వైసీపీ బీసీ మహిళ అయిన అక్రమాని విజయనిర్మలకు టికెట్ ఇచ్చింది. అలాగే విశాఖ మేయర్ పదవిని బీసీ మహిళకు ఇచ్చింది. ఎమ్మెల్సీ సీటుని కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వంశీ క్రిష్ణకు ఇచ్చింది. ఈ ముగ్గురూ యాదవ సామాజికవర్గానికి చెందిన వారు. విశాఖ తూర్పులో వారి జనాభాయే అధికం.

దాంతో వైసీపీ కరెక్ట్ రూట్ లో వెళ్తోంది. ఇక వెలగపూడి నాన్ లోకల్ అని, ఆయన అగ్ర వర్ణానికి చెందిన వారు అని వైసీపీ ప్రచారం చేస్తోంది. దాంతో వచ్చే ఎన్నికల నాటికి సీన్ వైసీపీకి అనుకూలంగా మారుతుందని టీడీపీ ఆలోచిస్తోంది. దాంతో పాటు వెలగపూడికి పొలిటికల్ గ్లామర్ తగ్గిందని కూడా భావిస్తోంది.

దీంతో వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్ధిని బరిలోకి దించడానికి టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అది కూడా యాదవ సామాజికవర్గం నుంచే ఉండవచ్చు అంటున్నారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం కలవరపడుతోంది. బాలక్రిష్ణకు సన్నిహితుడిగా పేరు పొందిన వెలగపూడికి ఈసారి టికెట్ దక్కదు అని ప్రచారం అయితే పార్టీలో స్టార్ట్ అయిపోయింది.

మరో వైపు బీసీలకు టికెట్ అని లీకులు వదలడంతో ఆ వర్గీయులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు వెలగపూడి క్యాంప్ లో పెద్ద ఎత్తున చర్చకు తావిస్తున్నాయి. ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా తీసుకున్న టీడీపీ భారీ మార్పులు ఉంటాయి అంతా సహకరించాల్సిందే అంటోంది. మరి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హ్యాట్రిక్ తమ్ముడు సైడ్ అయిపోవడం ఖాయమనే అంటున్నారు.