Begin typing your search above and press return to search.

వెలమ v/s కమ్మ

By:  Tupaki Desk   |   14 Dec 2018 8:10 AM GMT
వెలమ v/s కమ్మ
X
తెలుగు రాష్ట్రాలలో రాజకీయం రంజుగా మారింది. రోజురోజుకి కొత్త రూపు తీసుకుంటోంది. మిత్రులు.. శత్రువులుగాను - శత్రువులు మిత్రులుగాను రూపాంతరం చెందుతున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకోవడంతో రాజకీయ పార్టీలకు కులాల రంగు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో సంఖ్య పరంగా తక్కువగా ఉన్న కమ్మ కులస్తులు తెలుగుదేశం పార్టీని తమదిగా చేసుకున్నారు. అప్పటికే సమైక్య రాష్ట్రంలో రెడ్డి కులస్థులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అప్పటి వరకు సామాజికంగా చిన్న చిన్న వైరాలున్న రెడ్డి - కమ్మ కులస్థుల మధ్య రాజకీయ వైరం ఊపందుకుంది. తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలు కులరాజకీయాలనే ప్రధానంగా తెరపైకి తెచ్చాయి. ఆనాటి నుంచి రాష్ట్రం విడిపోయే వరకు ఈ రెండు కులాల మధ్య రాజకీయ వైరం రగులుతూనే ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో వెలమ కులస్థుల పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. అంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి కులస్థులు ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. ఇక్క‌డి రెడ్లు మాత్రం కాంగ్రెస్‌ తో ఉండిపోయారు.

తాజాగా తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలలో కుల రాజకీయం కొత్త రూపం సంతరించుకుంది. మహాకూటమి పేరుతో ఏర్పడిన ప్రజాకూటమి విజయం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసాడు. దీంతో కమ్మ కులస్థులందరూ తెలంగాణలో కేసీఆర్‌ ను ఓడించేందుకు ఏకమయ్యారు. చంద్రబాబు తెలంగాణ రాకతో రాజకీయ పార్టీల వైరం కాస్త కులవైరంగా మారిపోయింది. దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్‌ పై కూడా పడింది. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లోని గుడివాడ - నర్సిపట్నం - గణపవరం - విజయనగరం - బొబ్బిలి వంటి పట్టణాలలో కేసీఆర్‌ కు జై కొడుతూ వెలమ సంఘాల ఫ్లెక్సీలు వెలిశాయి. అంతే కాదు మన కులం గెలిచిందంటూ బాణాసంచా కాల్చడం మిఠాయిలు పంచడం వంటివి చేశారు. దీని వెనుక కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజయం కంటే కమ్మ కులస్థుడైన చంద్రబాబు నాయుడి పరాజయమే ఎక్కువ ప్రభావం చూపిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌ లో ప్రచారం చేయడం కూడా కమ్మ కులానికి వ్యతిరేకంగా అని వ్యాఖ్యానాలు వస్తున్నాయి. దశాబ్దాలుగా ఉన్న కులాల వైరం తెలంగాణ ఎన్నికలతో మారింది. ఇన్నాళ్లు రెడ్డి.... కమ్మ కులాల మధ్య ఉన్న వైరం ఇక ముందు వెలమ వర్స్‌స్ కమ్మగా కూడా మారబోతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.