Begin typing your search above and press return to search.
రేవంత్ తో పాటు ఈయన కూడా పార్టీ వీడారు
By: Tupaki Desk | 28 Oct 2017 5:16 PM GMTతెలంగాణ టీడీపీకి మరో దుర్వార్త. ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కారణంగా ఇప్పటికే తెలంగాణ టీడీపీకి షాక్ మీద షాక్ తగులుతుండగా దానికి మరో పరిణామం తోడయింది. టీడీపీకి, తన శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన ఉదంతం మరువక ముందే...రేవంత్ దారిలోనే నడిచేందుకు మరో సీనియర్ సిద్ధమయ్యారు. పార్టీ సీనియర్ నేత - మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీకి షాక్ ఇచ్చారు.
తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న వరంగల్ జిల్లాలో ముఖ్యనేత అయిన వేం నరేందర్ రెడ్డి కూడా తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. తాను రేవంత్ తో పాటు కలిసి ముందుకు సాగేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా...మరికొందరు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రావచ్చునని అంటున్నారు.
కాగా, టీడీపీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి వ్యవహారంపై టీడీపీ నేత పెద్దిరెడ్డి స్పందించారు. టీడీపీ రథసారథి - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈ రోజు విజయవాడలో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు. పార్టీని మారిన వారి గురించి తాము విమర్శలు చేయదలుచుకోవడం లేదని అన్నారు. ఎంతో ఆవేదన, బాధతో రేవంత్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి లేఖ రాశారని అన్నారు. టీడీపీలో ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు తాను సమాధానం చెప్పదలుచుకోలేదని పెద్దిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ నేతలు పోరాటం చేస్తారని, తెలుగు దేశం పార్టీ తెలంగాణలో బలహీనపడబోదని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీని తెలంగాణలో బలపర్చుతామని చెప్పారు. ఎన్నికలకు చాలా కాలం సమయం ఉందని అప్పుడే పొత్తుల గురించి మాట్లాడడం సబవు కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ మహాసముద్రం అని, అందులోకి వెళ్లితే ఏమవుతుందో అందరికీ తెలుసని పెద్దిరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.