Begin typing your search above and press return to search.

పత్రికాధిప‌తి మాట‌పై సిక్కోలు మండిపాటు!

By:  Tupaki Desk   |   5 Oct 2018 4:33 AM GMT
పత్రికాధిప‌తి మాట‌పై సిక్కోలు మండిపాటు!
X
నోట్లో నుంచి వ‌చ్చే మాట ఆచితూచి అన్న‌ట్లుగా ఉండాలి. ఏ మాత్రం తేడా కొట్టినా మొద‌టికే మోసం రావ‌టం ఖాయం. తాజాగా అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌. ఇటీవ‌ల ఆయ‌న చేసిన ఒక ఇంట‌ర్వ్యూలో భాగంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌పై శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ప‌లువురు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌తి ఆదివారం రాత్రి వేళ‌.. త‌న ఛాన‌ల్ లో ఏదో ఒక ప్ర‌ముఖుడితో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తుండ‌టం తెలిసిందే. తాజాగా శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడితో మాట్లాడిన సంద‌ర్భంలో ఆంధ్ర‌జ్యోతి ఎండీ చేసిన వ్యాఖ్య‌పై శ్రీ‌కాకుళం వాసులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఎంపీ రామ్మోహ‌న్ నాయుడితో మాట్లాడే సంద‌ర్భంగా ఆర్కే.. పొట్ట చింపితే హిందీ అక్ష‌రం రాని ఉత్త‌రాంధ్ర అంటూ చేసిన వ్యాఖ్య‌పై అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది. నిజానికి రామ్మోహ‌న్ నాయుడ్ని పొగిడే క్ర‌మంలో.. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ప్ర‌జ‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య.. అక్క‌డి ప్ర‌జ‌ల్ని చిన్న‌బుచ్చేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే.. ఈ మాట అనుకోకుండా య‌ధాలాపంగా వ‌చ్చిందే త‌ప్పించి.. చిన్న‌బుచ్చాల‌న్న ఉద్దేశంతో చేసింది కాద‌న్న మాట ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక త‌న ఖండ‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

అయితే.. ఆర్కే వ్యాఖ్య‌ల‌పై ఉత్త‌రాంధ్ర ర‌చ‌యిత‌లు.. క‌వుల వేదిక అలియాస్ ఉర‌క‌వే మాత్రం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. సిక్కోలు నేల‌ను హేళ‌న చేసిన ఎంత‌టివారినైనా వ‌దిలిపెట్టేది లేద‌న్నారు. ఎంతో ఘ‌న చ‌రిత్ర ఉన్న ఉత్త‌రాంధ్ర‌ను పాల‌కులు.. ప‌త్రికాధిప‌తులు చిన్న‌బుచ్చ‌టంలో అర్థం లేదంటున్నారు. మ‌రి.. ఈ వివాదం ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుందో?