Begin typing your search above and press return to search.

జగన్ ను అడ్డు తొలగించేందుకు కుట్ర జరుగుతోందా?

By:  Tupaki Desk   |   28 May 2022 4:45 AM GMT
జగన్ ను అడ్డు తొలగించేందుకు కుట్ర జరుగుతోందా?
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు కుట్ర జరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, బాపట్ల జిల్లా వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున. సీఎం వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను చంపడానికి కుట్ర పన్నుతున్నారని మేరు గ ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి గాల్లో వచ్చినవాడు గాల్లోనే పోతాడని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అన్నారని మంత్రి మేరుగ గుర్తు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తహతహలాడుతున్నారని మంత్రి మేరుగ నాగార్జున చెబుతున్నారు. ప్రజల్లో రోజురోజుకు జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబునాయుడు.. జగన్‌ను అడ్డుతొలగించుకోవాలనే కుట్రకు తెరలేపుతున్నారని మేరుగ సంచలన ఆరోపణలు చేశారు.

ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఏపీలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలకు అధిక మంత్రి పదవులు కేటాయించారని, ఇతర పదవుల్లోనూ అత్యధికం ఈ వర్గాలకే కేటాయించారని ప్రజలకు వివరిస్తున్నారు.

ఇందులో భాగంగా మంత్రి మేరున నాగార్జున అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్‌ను రాష్ట్రంలో లేకుండా చేస్తానని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడులో వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో చంద్రబాబు పలుమార్లు చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్‌ అభిమానులను కలవరపెడుతున్నాయని అంటున్నారు. జగన్‌ను రాష్ట్రంలోనే లేకుండా చేస్తానని చంద్రబాబు చెప్పడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోందని మేరుగ నాగార్జున చెబుతున్నారు.

జగన్‌మోహన్‌రెడ్డిని కాపాడుకునేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా సిద్ధంగా ఉండాలని కోరారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌మోహన్‌రెడ్డి వెంట్రుక కూడా పీకలేరన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఐకమత్యంగా ఉండి పార్టీకి, ముఖ్యమంత్రి అండగా నిలవాలని మేరుగ విన్నవిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే శాశ్వతమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే తట్టుకోలేక చంద్రబాబు నాయుడు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మేరుగ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని పార్టీలు కలిసి పోటీచేసినా మళ్లీ అధికారం వైఎస్సార్‌సీపీదేనని మేరుగ చెబుతున్నారు.


కాగా మేరుగ నాగార్జున వ్యాఖ్యలపై టీడీపీలో విస్మయం వ్యక్తమవుతోంది. జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించి రాష్ట్రం నుంచి తరిమేస్తానన్నది చంద్రబాబు నాయుడు ఉద్దేశమని చెబుతున్నారు. ఈ మాటలను వైఎస్సార్సీపీ నేతలు తమకు అలవాటైన రీతిలో వక్రీకరించుకుని మళ్లీ అల్లర్లకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం, అల్లర్లు సృష్టించడం, లేనిపోని అనుమానాలు కలుగ జేయడం వైఎస్సార్సీపీకి అలవాటైన పని అని తీవ్రంగా విమర్శిస్తున్నారు.