Begin typing your search above and press return to search.

మోడీని ఫాలో అయిన వెనిజులా

By:  Tupaki Desk   |   12 Dec 2016 11:32 AM GMT
మోడీని ఫాలో అయిన వెనిజులా
X
ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత్ లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాలు ఘోసిస్తున్నా ఈ నిర్ణయంతో మంచి ఫలితాలు వస్తాయని మేధోవర్గాలు మాత్రం ప్రశంసిస్తున్నాయి. అంతర్జాతీయంగానూ పలు దేశాలు మోడీ నిర్ణయానికి భేష్ అన్నాయి. తాజాగా వెనెజులా ఏకంగా శభాష్ అనడమే కాదు మోడీ నిర్ణయాన్ని తమ దేశంలోనూ ఆచరణలోకి తీసుకొచ్చింది. అక్కడా పెద్ద నోట్లను రద్దు చేశారు.

వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో తమ దేశంలో అతిపెద్ద కరెన్సీ అయిన 100 బొలివర్ నోటును రద్దుచేస్తున్నట్లు అత్యవసర ఆదేశాలు జారీచేశారు. వెనిజులా ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా దాదాపుగా మనలాంటి కారణాలే చెప్పారు. వెనెజులా కరెన్సీని కొలంబియాలోని మాఫియా వర్గాలు భారీ ఎత్తున పోగు చేసి వెనిజులాలో కల్లోలానికి కారణమవుతున్నాయి. ఆ మాఫియా పీచమణచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మదురో ప్రకటించారు. రద్దయిన కరెన్సీని మార్చుకోవడానికి 72 గంటల సమయం మాత్రమే ఇచ్చారు.

ప్రపంచంలోనే ద్రవ్యోల్బణం అత్యంత ఎక్కువగా ఉన్న వెనిజులాలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువకు దాదాపు 200 రెట్ల ఎక్కువ విలువైన కొత్త నోట్లు, నాణేలను విడుదల చేసేందుకు వెనిజులా సిద్ధం అవుతోంది. అంటే రద్దు చేసిన పెద్ద నోట్ల వేల్యూకి మించి కొత్త కరెన్సీ వస్తుంది.. కానీ, ఆ కరెన్సీ ముఖ విలువ తక్కువగా ఉండబోతోంది.