Begin typing your search above and press return to search.
ఇద్దరు చంద్రులకు..వెంకయ్య దెబ్బేశారే!
By: Tupaki Desk | 11 Feb 2018 11:08 AM GMTపార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇటు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, అటు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావులు అపఖ్యాతి మూటగట్టుకున్న నేతలుగా చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచిపోతారేమో. గతంలోనూ పార్టీ ఫిరాయింపులు జరిగినా... ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్న ఇద్దరు చంద్రుళ్లు ప్రోత్సహించినంత మేరగా ఏ ఒక్కరు కూడా ఫిరాయింపులను ప్రోత్సహించలేదనే చెప్పాలి. తమ ఎదుట బలమైన ప్రతిపక్షం ఉండకూడదన్న ఒక్క భావనతోనే ఇద్దరు చంద్రుళ్లు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారు. అయితే ఈ తరహా వ్వవహార సరళిపై ఇంటా బయటా విమర్శలు వినిపించినా కూడా వారిద్దరూ పట్టించుకున్న పాపానే పోలేదని చెప్పాలి. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయమే... వారిద్దరూ పార్టీ ఫిరాయింపులకు తెర తీశారన్న వాదన వినిపిస్తోంది. బలమైన ప్రతిపక్షం ఉంటే... ఎక్కడ ఓటమి పాలవుతామోనన్న భయమే వారికి ఈ దిశగా ఉసికొల్పిందన్న వాదన కూడా లేకపోలేదు.
కేసీర్ తెర తీసిన ఆపరేషన్ ఆకర్ష్‌కు తెలంగాణలో టీడీపీ చాప చుట్టేసే పరిస్థితి వస్తే... చంద్రబాబు ఇక తెలంగాణ గురించి పట్టించుకునే అవసరమే లేకుండా పోయిందన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో కంటే కూడా ఏపీలోనే ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింతగా పదును పెట్టిన చంద్రబాబు... విపక్ష వైసీపీని సంఖ్యాబలం పరంగా బలహీనం చేసి ఉంటే ఉండొచ్చు గానీ... పార్టీ ఫిరాయింపులపై వైసీపీ ఎప్పటికప్పుడు తన వాణిని బలంగానే వినిపిస్తుండటంతో పాటుగా... టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలోకి వస్తున్న సందర్భంగా ఆయన చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించిన జగన్... బాబు అండ్ కోకు గట్టి దెబ్బే కొట్టారని చెప్పక తప్పదు. ఇక పార్టీ ఫిరాయింపులపై ఇంతగా చెప్పుకునేందుకు ఇప్పుడు సందర్భమేమిటన్న విషయానికి వస్తే... నేటి మధ్యాహ్నం హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు... చాలా కూల్ గానే పార్టీ ఫిరాయింపులపై సుతిమెత్తని కామెంట్లు చేసి... ఇద్దరు చంద్రుళ్లకు గట్టి షాకే ఇచ్చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగానే కాకుండా తమిళనాడుకు గవర్నర్‌గానూ పనిచేసిన కొణిజేటి రోశయ్యకు లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డును అందజేసేందుకు హైదరాబాదు వచ్చిన వెంకయ్య... అదే సభా వేదికగా ఇద్దరు చంద్రుళ్లకు షాక్ ఇచ్చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే పలు సందర్భాల్లో వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా తనదైన శైలిలో కామెంట్లు చేసిన సంగతీ తెలిసిందే. అయితే ఈ దఫా మాత్రం వెంకయ్య.. ఇద్దరు చంద్రుళ్లకు నేరగానే కాకుండా కాస్తంత గట్టిగానే దెబ్బ తగిలేలా సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. అయినా వెంకయ్య ఏమన్నారన్న విషయానికి వస్తే.. *ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారే విధానం సరికాదు. నచ్చిన వారు నచ్చిన పార్టీలో చేరడంలో తప్పు లేదు. కానీ పదవుల్లో ఉంటూ వేరే పార్టీలో చేరడం మాత్రం సరికాదు. పార్టీ మారాలనుకుంటే, ఆ పార్టీ వల్ల వచ్చిన పదవులను వదులుకొని వేరే పార్టీలో చేరవచ్చు. ఏపీ - తెలంగాణల గురించి చెప్పడం లేదు. దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నా. ప్రజల తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే* అని వెంకయ్య వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులు తప్పేనని చెప్పిన వెంకయ్య అంతటితో ఆగి ఉంటే సరిపోయేదేమో. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్న తాను... ఏపీ. తెలంగాణల గురించి చెప్పలేదంటూ వ్యాఖ్యానించిన వెంకయ్య... నిజంగానే ఇద్దరు చంద్రుళ్లకు కోలుకోలేని దెబ్బ తీశారనే చెప్పాలి.