Begin typing your search above and press return to search.

ప్రత్యేక ప్రకటనలు మొదలైపోయాయి!

By:  Tupaki Desk   |   14 Sep 2016 6:03 AM GMT
ప్రత్యేక ప్రకటనలు మొదలైపోయాయి!
X
ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించింది ప్రత్యేక హోదా.. మేనిఫెస్టోల్లో పెట్టింది ప్రత్యేక హోదా.. వారిని - మిత్రులను అధికారంలో కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించింది ప్రత్యేక హోదా.. ప్రజలు కోరుకున్నదీ ప్రత్యేక హోదా.. రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైనది ప్రత్యేక హోదా.. అయినా కూడా వారు చేయాలనుకున్నది చేశారు, ఇవ్వాలనుకున్నది ఇచ్చారు. కారణాలు ఏవైనా - కారకులు ఎవరైనా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ విషయాలపై స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం ప్రకటిస్తే.. పాచిపోయిన లడ్డూలని పవన్ కల్యాన్ విమర్శించారు. ప్రతిపక్షాలు - ప్రజలు రోడ్లపైకి వచ్చి నినదించారు.. అయినా ఫలితం మారలేదు, వాటికి తోడు తాజాగా ప్రకటనలు వెలువడుతున్నాయి. వీటిని వెటకారమనుకోవాలా - కారం చల్లడం అనాలా లేక ప్రజలను మోసగించినందుకు అభినందనలు అనాలా?

"ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కంటే మరెన్నో ప్రయోజనాలున్న ప్రత్యేక ప్యాకేజీని అందించిన మన ప్రియతమ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గారికి ఇవేమా శుభాకాంక్షలు"... తెలుగు టీవీ చానల్స్ లో ఈ ప్రకటనలు మారుమ్రోగిపోతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు శుభాకాంక్షలు చెబితే సరేలే అనుకోవచ్చు కానీ... ప్రత్యేక హోదా కంటే మరెన్నో ప్రయోజనాలున్న ప్యాకేజీ అనడమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అభిమానంతో పాటు - అవసరం - డబ్బు కలిగి ఉన్న వారు ప్రకటనలు ఇవ్వడంలో ఎవరి ఇష్టం వారిదే కానీ.. ప్రజలను వెక్కిరించేలా ఇవ్వడమే కాస్త ఇబ్బందిని కలిగించే అంశం అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేకపోయిన, మాట దాటివేసి బీజేపీ నాయకుల మనసు మారాలని.. అలా కాని పక్షంలో ఆంధ్రుల ఆగ్రహాలకు గురికాకతప్పదని హెచ్చరిస్తూ కూడా ఎవరైనా ప్రకటనలు ఇస్తే బాగుంటుంది కదా అని మరికొందరు ఆశపడుతున్నారు.