Begin typing your search above and press return to search.

బాబు -వెంక‌య్య మౌనంగా ఉంటేనే మంచిదా?

By:  Tupaki Desk   |   14 Nov 2016 10:30 PM GMT
బాబు -వెంక‌య్య మౌనంగా ఉంటేనే మంచిదా?
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఇద్ద‌రు నాయుళ్లుగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు, కేంద్రమంత్రి వెంక‌య్య నాయుడులు అవ‌లంబిస్తున్న వైఖ‌రిపై స‌ర్వ‌త్రా విస్మ‌యం, ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మవుతున్నాయి. ఏరు దాటేదాకా ఏటి మ‌ల్ల‌న్న‌.. ఏరు దాటాక ..బోడి మ‌ల్ల‌న్న త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ విన‌వ‌స్తోంది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్పుడే జ‌రిగిన‌ విభ‌జ‌న క‌ష్టాల‌తో కునారిల్లిపోతున్న ఏపీకి, ఆగ్ర‌హావేశాల‌తో అట్టుడుకుతున్న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను బుజ్జ‌గించేందుకు ఈ ఇద్ద‌రు నాయుళ్లు పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు.

విభ‌జ‌న‌తో రెండు కాళ్లూ తెగిపోయిన ఏపీకి ప్ర‌త్యేక హోదా అత్య‌వ‌స‌ర‌మ‌ని, అది ఉంటే రాష్ట్రం ప‌రుగులు పెడుతుంద‌ని వెంక‌య్య‌, చంద్ర‌బాబులు ఎక్క‌డిక‌క్క‌డ ఎన్నిక‌ల స‌భ‌ల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో, ఎన్ని వేల పరిశ్రమలు వస్తాయో, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయో ఓటర్లందరికీ అర్థమయ్యేలా చేశారు. దీంతో ఒక ప‌క్క త‌న తండ్రి సెంటిమెంట్‌తో స్టేట్ మొత్తాన్ని తిప్పేస్తున్న జ‌గ‌న్‌ని సైతం జ‌నాలు ప‌క్క‌న పెట్టేసి, చంద్ర‌బాబు ను ఆయ‌న పార్టీని నెత్తిన పెట్టుకున్నారు.

అయితే, అధికారంలోకి వ‌చ్చిన ఏడాది అనంత‌రం తెర‌మీద‌కి వ‌చ్చిన ప్ర‌త్యేక హోదాపై స్పందించిన కేంద్రం స‌హా ఇద్ద‌రు నాయుళ్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. హోదా బ్ర‌హ్మ ప‌దార్థం కాద‌ని బాబు చెప్ప‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేసింది. ఆ త‌ర్వాత వెంక‌య్య మాట్లాడుతూ.. ఇక‌పై హోదా ఉండ‌ద‌ని ప్ర‌క‌టించారు. దీంతో హోదా విష‌యంలో కేంద్ర యూ ట‌ర్న్ తీసుకుంద‌ని అర్ధ‌మైంది. అయితే, ఈ ప‌రిస్థితిలో ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా చెబితే.. బాగుండేది. కానీ, హోదాతో ఒరిగేది లేద‌ని హోదాపై ప్ర‌త్యేకంగా యాంటీ ప్ర‌చారం అందుకున్నారు. ఇక‌, ఈ ప‌రిణామం ఎటు దారితీస్తుందో చూడాలి. ఇప్ప‌టికైతే.. ఇద్ద‌రు నాయుళ్లు ఇలా ప్ర‌చారం కాకుండా మౌనంగా ఉంటేనే మంచిద‌ని...లేకుంటే 2019 ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రు నాయుళ్ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న టాక్ వ‌స్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/