Begin typing your search above and press return to search.

వైసీపీకి నో ఛాన్స్.. టీడీపీతోనే రొమాన్స్

By:  Tupaki Desk   |   6 Dec 2015 6:18 AM GMT
వైసీపీకి నో ఛాన్స్.. టీడీపీతోనే రొమాన్స్
X
మారుతున్న రాజకీయ పరిస్థితులు, ఏపీపై కేంద్రం శీతకన్ను వేయడం, ఎన్డీయేలో చేరాలని ఇతర పార్టీలు కొన్ని ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో టీడీపీ, బీజేపీ పొత్తుపై కొన్నిరోజులుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, కేంద్ర మంత్రి - బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఆ అనుమానాలను పటాపంచలు చేశారు. ఎన్డీయేలో చేరాలనుకుంటున్న వైసీపీకి నో ఛాన్స్ అని చెప్పేశారు. అంతేకాదు... టీడీపీతోనే తాము రొమాన్సు చేస్తామని కూడా చెప్పేశారు.

విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వెంకయ్య మాట్లాడిన మాటలు టీడీపీలో కొత్త ఊపు తెచ్చాయి. ఆయన వైసీపీని టార్గెట్ చేసి చేసిన కామెంట్లకు టీడీపీ నేతలు చప్పట్లు కొట్టారు. బీహార్ ఎన్నికల ప్రభావం వల్ల బీజేపీకి చంద్రబాబు విలువ తెలిసిందని ఇప్పటికే అనుకుంటున్న తరుణంలో వెంకయ్య ప్రసంగం అందుకు బలం చేకూర్చింది. ఫ్లైఓవర్ నిర్మించిన వారిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారంటూ చంద్రబాబుపై పొగడ్తలు కురిపించిన వెంకయ్య… రాబోయే రోజుల్లో ఏపీ శక్తివంతమైన రాష్ట్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి రాత్రికి రాత్రే జరగదని, అందుకు కొంత సమయం పడుతుందన్న వెంకయ్య… ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావాలని కొందరు అంటున్నారని పరోక్షంగా వైసీపీ తీరును దుయ్యబట్టారు. అంతేకాదు టీడీపీ బయటకు వస్తే మీరు చేరదామని అనుకుంటున్నారా అని వారిపై సెటైర్లు వేశారు.

కాగా ఇదే కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భారీగా వరాలు ప్రకటించారు. దీంతో ఏపీ పట్ల కేంద్రం వైఖరి మారుతోందని అనుకుంటున్నారు. ఈ లెక్కన సమీప భవిష్యత్తులో ఏపీకి మంచి రోజులు మొదలవుతాయని.. ఏపీ అవసరాలను కేంద్రం చూసుకుంటుందని భావిస్తున్నారు.