Begin typing your search above and press return to search.

వెంక‌య్య మాట మార్చేశారండోయ్‌!

By:  Tupaki Desk   |   23 Jun 2017 4:22 AM GMT
వెంక‌య్య మాట మార్చేశారండోయ్‌!
X
రైతుల రుణాల మాఫీకి సంబంధించి నోరు జారిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు దానిని స‌రి చేసుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. ముందుగా రుణ మాఫీపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన వెంక‌య్య‌... వాటిపై అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువ‌లా వ‌చ్చి ప‌డ‌టంతో ఒక్క‌సారిగా అల‌ర్ట్ అయిపోయారు. తాను ఒక మాట అంటే... దానిని మీడియా మ‌రో మాట‌లా అర్థం చేసుకుని నానా రాద్ధాంతం చేసింద‌ని కూడా ఆయ‌న మీడియాపై విరుచుకుప‌డ్డారు.

అస‌లు ఈ వివాదం పూర్తి వివ‌రాల్లోకి వెళితే... నిన్న ముంబైలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా రైతుల రుణ మాఫీపై ప్ర‌స్తావించిన వెంక‌య్య‌... *రుణ మాఫీ కోర‌డం ఈ రోజుల్లో ఫ్యాష‌న్ గా మారిపోయింది. కానీ స‌మ‌స్య‌కు అది ప‌రిష్కారం కాదు. గ‌త్యంతరం లేక‌పోతే త‌ప్పించి రైతుల రుణాలు మాఫీ చేయ‌కూడ‌దు* అని వెంక‌య్య అన్నారు. వెంక‌య్య వ్యాఖ్య‌లు అప్ప‌టిక‌ప్పుడే ఎల‌క్ట్రానిక్ మీడియా, ఆన్ లైన్ వెబ్‌సైట్ల‌లో వైర‌ల్‌ గా మారాయి. అయితే ఈ విష‌యం తెలియ‌ని ఆయ‌న ముంబైలో కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని నేరుగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. ఢిల్లీలో ల్యాండ్ కాగానే త‌న వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయ‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన వెంక‌య్య వేగంగా స్పందించారు. రైతుల‌ను కించ‌ప‌రిచేలా తానేమీ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని చెప్పిన వెంక‌య్య‌... రైతుల రుణాల‌ను మాఫీ చేయాల‌ని కోరుతున్న రాజ‌కీయ పార్టీల‌ను ఉద్దేశించే తాను ఈ వ్యాఖ్య‌లు చేశాన‌ని ఆయ‌న సెల‌విచ్చారు.

అయితే తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించిన మీడియా తాను రైతుల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశానంటూ రాద్ధాంతం చేశాయ‌ని మండిప‌డ్డారు. రైతుల రుణాల‌ను మాఫీ చేయాల‌ని కోర‌డం రాజ‌కీయ పార్టీల‌కు ఫ్యాష‌న్ అయిపోంద‌నే తాను వ్యాఖ్యానించాన‌ని, అస‌లు త‌న ప్ర‌సంగంలో రైతుల ప్ర‌స్తావ‌నే తేలేద‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే ముందుగా నోరు జారడం, ఆ త‌ర్వాత జ‌రిగిన త‌ప్పును తెలుసుకుని ఆ వివాదం నుంచి బ‌య‌ప‌డేందుకు మీడియాపైకి నెపాన్ని నెట్టివేయ‌డం ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఫ్యాష‌న్ అయిపోయిన నేప‌థ్యంలో... వెంక‌య్య వైపే కూడా జ‌నం అదే అనుమానంతో చూస్తున్నార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/