Begin typing your search above and press return to search.

వెన్నుపోటు ఎపిసోడ్ : ఎన్టీయార్ కి కాళ్ల మొక్కిన మహిళలే...?

By:  Tupaki Desk   |   5 Nov 2022 2:30 AM GMT
వెన్నుపోటు ఎపిసోడ్ : ఎన్టీయార్ కి కాళ్ల మొక్కిన  మహిళలే...?
X

తెలుగు నాట ఎన్టీయార్ కి రెండు సార్లు వెన్నుపోటు జరిగింది. రాజకీయాల గురించి ఎపుడు చెప్పుకున్నా ఈ వెన్నుపోటు ఎపిసోడ్ ని చెప్పక తప్పదు. అది ఎన్ని ఏళ్లు గడచినా పచ్చిగా పచ్చగా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీయార్ లాంటి మహానుభావుడుకి జరిగిన వెన్నుపోటు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత బాధపడినా కూడా తక్కువే. ఈ రోజున ఆయన ఫోటోకు దండ వేసి దండం పెట్టేవారు అంతా ఒకనాడు ఆయనకు దూరం జరిగిన వారే. ఎన్టీయార్ జీవితంలో విజయాలు ఆయన్ని ఆకాశమంత కీర్తిని తెస్తే వెన్నుపోటు ఎపిసోడ్స్ ఆయన విషాద రాజకీయ గమనానికి తార్కాణాలుగా నిలిచాయి.

ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో టూర్ చేస్తున్న మజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తాజాగా క్రిష్ణా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్టీయార్  వెన్నుపోటు ఎపిసోడ్ ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీయార్ కాళ్ళకు మొక్కుతూ ఆయనను దేవుడిగా భావించిన వారే అవే కాళ్ళు పట్టుకుని గుంజారని, వారిలో ముందు వరసలో మహిళలే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆ మహిళల పేర్లు తనకు తెలుసు కానీ ఇపుడు చెప్పడం కూడదని ఆయన దాటేశారు.

అయితే ఎన్టీయార్  కి వెన్నుపోటు జరగక ముందు జరిగిన తరువాత తాను ఆయన్ని కలిశాను అని అనాటి ముచ్చట్లు చెప్పుకున్నారు. తాను ఎన్టీయార్ ని కలసి కాళ్లకు అలా మొక్కుతున్న వారి గురించి వారు ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగాను అని ఫ్లాష్ బ్యాక్ చెప్పారు. దానికి ఎన్టీయార్ తన మీద వారికి ప్రేమ, అభిమానం ఉంది అని చెప్పారని అన్నారు. అయితే నాడు కాళ్ళు మొక్కిన వారే తరువాత ఆయన వెన్నుపోటుకు కారణం అయ్యారని వెంకయ్యనాయుడు గతాన్ని మరోసారి గుర్తు చేశారు. ఇక వెన్నుపోటు తరువాత చూస్తే ఎన్టీయార్ కి కాళ్ళు మొక్కిన ఆరుగురు మహిళలే ఆయనను గద్దె దించడంలో కీలకమైన పాత్ర పోషించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడవలేదని ఈ మధ్యనే చంద్రబాబు ఒక రియాల్టీ షోలో చెప్పుకున్నారు. తాము కాళ్ళు పట్టుకుని ఆయన్ని బతిమాలాం తప్ప వెన్నుపోటు పొడవలేదని అన్నారు. కానీ ఇపుడు చూస్తే వెంకయ్యనాయుడు వెన్నుపోటు జరిగిందని ఆ ఎపిసోడ్ లో మహిళలు కీలకమైన పాత్ర పోషించారు అన్ చెప్పడం ద్వారా మరోసారి ఆ ఎపిసోడ్ ని చర్చకు పెట్టారనుకోవాలి.

అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వెంకయ్యనాయుడు చెప్పింది 1984 వెన్నుపోటు గురించా లేక 1995  ఎపిసోడ్ గురించా అన్నదే ఆ చర్చ. అప్పట్లో ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచిన వారు  ఆరుగురు మహిళలు అంటున్నారు. వారిలో కొందరికి నెల రాజు నాదెండ్ల మంత్రివర్గంలో పదవులు కూడా దక్కాయని నాటి ముచ్చట్లు గుర్తు ఉన్న వారు చెప్పే మాట.  సో 1995 వెన్నుపోటు గురించి వెంకయ్యనాయుడు చెప్పి ఉండరనే అంటున్నారు. ఇది పూర్తిగా కుటుంబం చేసిన వెన్నుపోటు బయట వారికి పాత్ర ఏమీ లేదు కాబట్టి 1984 నాదెండ్ల వెన్నుపోటునే ఆయన ఉదహరించారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.