Begin typing your search above and press return to search.

ఫిరాయింపులపై వెంకయ్య కామెంట్…అప్పుడేమైంది?

By:  Tupaki Desk   |   9 Jun 2019 5:06 AM GMT
ఫిరాయింపులపై వెంకయ్య కామెంట్…అప్పుడేమైంది?
X
ఫిరాయింపులు ఆందోళనకరం అని అంటున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలని కూడా ఆయన అనేశారు. దేశంలో ఫిరాయింపుల వ్యవహారాలు ఆందోళనకరంగా ఉంటున్నాయని - వీటిని అరికట్టేందుకు చర్యలు కావాలని వెంకయ్య అన్నారు. మూడు నెలల్లో ఇలాంటి వ్యవహారాలు పరిష్కారం కావాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు.

నిజమే రాజకీయ ఫిరాయింపులను ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ సమర్థించరు. ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీకి చేరడం అనేది రాజకీయ నైచ్యం - అది అనైతికం. ఏ మాత్రం విలువల్లేకుండా ఎమ్మెల్యేలు పార్టీలు మారుతూ ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ఇలాంటి రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఫిరాయింపుల ద్వారా రాజకీయంగా ఎవరూ బలపడేది ఉండదని ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిని గమనించాకా అర్థం అవుతుంది.

అయితే పార్టీలు మాత్రం నేతలను చేర్చేసుకుంటే తాము బలపడతామన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో వెంకయ్య చెప్పిన రీకాల్ ప్రతిపాదన బాగానే ఉంది.అయితే ఇదే మాటలను వెంకయ్య నాయుడు గతంలో కూడా చెప్పి ఉంటే బావుండేదని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులను భారీగా ప్రోత్సహించిన దశలో వెంకయ్య ఈ విషయంలో చంద్రబాబుకు క్లాస్ పీకాల్సిందని అంటున్నారు. అప్పట్లో వెంకయ్య నాయుడు - చంద్రబాబు నాయుడు చాలా సన్నిహితంగా మెలిగారు. కేంద్రమంత్రిగా ఉంటూ వెంకయ్య తరచూ ఏపీలోనే ఉండేవారు. అప్పటికే ఫిరాయింపులు మొదలయ్యాయి కూడా. అప్పుడే చంద్రబాబుకు వెంకయ్య ఇలా క్లాసులు పీకి ఉంటే బావుండేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు!