Begin typing your search above and press return to search.

ఆ మాట అనడం వెంకయ్య చవకబారుతనం!

By:  Tupaki Desk   |   8 Aug 2016 4:47 AM GMT
ఆ మాట అనడం వెంకయ్య చవకబారుతనం!
X
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉన్న పరిస్థితిని గమనిస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. అవును మరి.. అటు కేంద్రంలో ఆయనది చాలా కీలకమైన పదవి. అక్కడేమో చక్రం తిప్పుతూ ఉంటారు. ఇక్కడ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కు వచ్చేసరికి.. ప్రజలందరూ ఆయనను తూలనాడుతూ ఉండే పరిస్థితి. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసాడని నిందల మీద నిందలు. ఇలాంటి విచితమ్రైన పరిస్థితిలో పడ్డప్పుడు ఆయన మీద జాలి పడాల్సిందే.

అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ ప్రత్యేక హోదా అనే అంశం హాట్‌ హాట్‌ గా చర్చల్లో నలుగుతున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారు. అదేమీ సంజీవని కాదంటూ జనాన్ని మళ్లీ బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ అంశాన్ని పక్కన పెడితే.. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌ కు వచ్చిన ప్రతిసారీ ఒక మాటచెబుతూ ఉంటారు. ఆ మాట మాత్రం.. అంత సీనియర్‌ నాయకుడి చవకబారు వ్యాఖ్యలకు నిదర్శనం అని ప్రజలు భావిస్తున్నారు.

''తాను ఈ రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నికైన వ్యక్తిని కాకపోయినప్పటికీ... ఆంధ్రప్రజల ప్రతినిధి కాకపోయినప్పటికీ..'' అని ఆయన ప్రతిసారీ విలేకరులకు, వారి ద్వారా ప్రజలకు గుర్తు చేస్తూ ఉంటారు. వెంకయ్యనాయుడు పలాయనవాదంలో ఇది చాలా చీప్‌ టెక్నిక్‌ అని ప్రజలు భావిస్తుండడం విశేషం. రాష్ట్రానికి తానేమీ చేయలేని స్థితిలో ఉంటే చేయకపోవచ్చుగాక, అంత మాత్రాన.. తాను ఇక్కడినుంచి ఎన్నిక కాలేదంటూ పదేపదే చెప్పడం అనేది వెంకయ్య నాయుడు మీద రాష్ట్ర ప్రజల్లో ఉన్న గౌరవాన్ని పలుచన చేస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

ఏపీ నుంచి ఎంపీ కాలేదు గనుక.. ఈరాష్ట్రాన్ని కేంద్రం ఎంత దారుణంగా వంచిస్తూ ఉన్నా చూస్తూ ఊరుకుంటున్నారా? అంటే వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌ కు నికరమైన పూచీ తీసుకుని పోరాడాలంటే.. ఆయనను ఈ రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నుకుంటే తప్ప - పట్టించుకోబోయేది లేదని - ఆయన ఇండైరక్టుగా హింట్లు ఇస్తున్నారా? అని జనానికి అనుమానం కలుగుతోంది. నిజానికి వెంకయ్యనాయుడు జనాన్ని మెప్పించి జనం ఓట్ల ద్వారా గెలిచి ప్రజాప్రతినిధి అయ్యే సీజను ఎప్పుడో దాటిపోయింది. పార్టీ నాయకులను మెప్పించి, వారి ప్రాపకం ద్వారా ఎంపీ అయ్యే సీజనులో ప్రస్తుతం ఉన్నారు. అందుకే కాబోలు.. భాజపా రాజ్యాంగం చెప్పే నిబంధనల్ని ఉల్లంఘించి.. ఆయనకు మరోసారి ఎంపీ పదవి కట్టబెట్టారు. ''తాను ఈ రాష్ట్రం ప్రతినిధిని కాకపోయినప్పటికీ...'' అనే మాట వెంకయ్య వాడినప్పుడెల్లా.. అందుకే ఆయన మన రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదని, తనకు పదవులు ఇస్తున్నది పార్టీ మాత్రమే గనుక, కేవలం పార్టీకే విధేయంగా.. వారి రాజకీయ ఎత్తుగడలకు ఉపయోగపడుతూ ఉన్నారని జనం అనుకుంటున్నారు.