Begin typing your search above and press return to search.

చంద్రబాబు, వెంకయ్యల వార్

By:  Tupaki Desk   |   23 April 2016 6:48 AM GMT
చంద్రబాబు, వెంకయ్యల వార్
X
ఏపీ సీఎం చంద్రబాబు - కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఎవరైనా చెప్పేదొక్కటే. ఒకరినొకరు ప్రశంసించుకోవడంలో... ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకోవడంలో ఈ ఇద్దరు నేతలను మించిన దోస్తులు దేశంలోనే ఇంకెవరూ లేరని చెబుతారు. కానీ.... అలాంటి ఆ ఇద్దరి మధ్య తీవ్ర మాటల యద్ధం జరిగితే.... ‘‘అబ్బే... మేం నమ్మం’’ అంటారు కదా. కానీ, నిజం... ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. వారిద్దరి మధ్య సంవాదం నెలకొంది. అయితే.. అది వ్యక్తిగత సంవాదం కాదులెండి. నవ్యాంధ్ర అభివృద్ధికి సంబంధించి ఇద్దరూ వాదులాడుకున్నారు.

నిన్న విజయవాడ కేంద్రంగా ఏపీ సర్కారు సీపెట్ కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి సీఎం హోదాలో చంద్రబాబు - కేంద్ర మంత్రి హోదాలో వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా మాట్లాడిన వెంకయ్య... నిధుల కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు గురించి మాట్లాడుతూ... అందరు ముఖ్యమంత్రులది అధికార వ్యామోహమైతే - చంద్రబాబుది అభివృద్ధి వ్యామోహమని... ఎంత ఇచ్చినా చాలదంటారని... ఇంకా కావాలని అడుగుతారని చెప్పారు. అక్కడితో ఆగకుండా దానికి ఉదాహరణలు కూడా చెప్పారు. అనంతకుమార్ ఇప్పుడు ఐదు వేల కోట్లిస్తామంటే, చంద్రబాబు అది సరిపోదని పదివేల కోట్లడుగుతారు. 10 వేల కోట్లిస్తామంటే, 15 వేల కోట్లడుగుతారు. అభివృద్ధి, ప్రజల కోసం ముందుచూపుతో చంద్రబాబు ఇలా అడుగుతారు అన్నారు. ఆ వెంటనే మాట్లాడిన చంద్రబాబు వెంకయ్య మాటలకు కౌంటరేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు సహాయం కోరుతున్నామని... ఇప్పటికే కొంత ఇచ్చినా ఇంకా కావాలని అన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చేవరకూ కేంద్రం నవ్యాంధ్రకు సహాయం చేయాలని... అంతవరకు అడుగుతునే ఉంటామని చెప్పుకొచ్చారు.

అయితే.. చూడ్డానికి ఇది ఇద్దరి మధ్య సంవాదంలా అనిపించినా ఇది కూడా ఒకరకంగా ప్లానుప్రకారం చేసుకుంటున్న ప్రచారమేనని రాజకీయ పండితులు అంటున్నారు. నిందించినట్లుగా, కౌంటరేసినట్లుగా అనిపించినా కూడా ఇది వారు రాష్ట్రం కోసం పడుతున్న కష్టాన్ని చెప్పడానికి వాడుకున్న టెక్నిక్ అని తెలుస్తోంది. మొత్తానికి ఇద్దరికి ఇద్దరూ ఒకలాంటోళ్లే అంటున్నారు. దీన్నే నిందాస్తుతి అంటారని... నిందించినట్లుగా ఉన్నా అందులో స్తుతే ఉంటుందని చెబుతున్నారు.