Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు షాకిచ్చిన వెంక‌య్య‌!

By:  Tupaki Desk   |   25 Feb 2017 9:11 AM GMT
కేసీఆర్‌ కు షాకిచ్చిన వెంక‌య్య‌!
X
తెలంగాణ‌లో ముస్లిం మైనారిటీల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని అధికార టీఆర్ ఎస్ పార్టీ ఆది నుంచి చెబుతూ వ‌స్తోంది. గ‌తంలో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముస్లింల‌కు ఇచ్చిన 4 శాతం రిజ‌ర్వేష‌న్ల స్థానే వాటిని 12 శాతానికి పెంచేస్తామ‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతూ వ‌స్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆ పార్టీ ఇదే మాట చెప్పింది. మొన్న‌టి గ్రేట‌ర్ హైద‌రాబాదు మునిసిప‌ల్ కార్పోరేషన్ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ ఎస్ ఈ మాట‌ను మ‌రోమారు వ‌ల్లె వేసింది. ఫ‌లితంగా మ‌జ్లిస్ పార్టీ బ‌లంగా ఉన్న ప్రాంతాల్లోనూ ఆ పార్టీకి ఓట్లు వెల్లువ‌లా వ‌చ్చిప‌డ్డాయి. ఫ‌లితంగా మునుపెన్న‌డూ లేని విధంగా అత్య‌ధిక స్థానాల‌ను గెలుచుకున్న టీఆర్ ఎస్ రికార్డు విజ‌యాన్ని న‌మోదు చేసింది.

టీడీపీ - కాంగ్రెస్ పార్టీల‌ను చావు దెబ్బ కొట్టిన టీఆర్ ఎస్... ఆ త‌ర్వాత రాష్ట్రంలోని మిగిలిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ విజ‌య పరంప‌ర కొన‌సాగించింది. ఈ క్ర‌మంలో ముస్లిం మైనారిటీల‌కు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ల హామీని నిల‌బెట్టుకునే దిశ‌గా కాస్తంత నిదానంగానైనా టీఆర్ ఎస్ ఆ పనిని మొద‌లుపెట్టింద‌నే చెప్పాలి. ఇలాంట‌టి కీల‌క త‌రుణంలో బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి వెంకయ్య‌నాయుడు కాసేప‌టి క్రితం హైద‌రాబాదులో జ‌రిగిన ఓ కీల‌క స‌మావేశంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌కు బీజేపీ వ్య‌తిరేక‌మ‌ని, ఇదే వైఖ‌రితో త‌మ పార్టీ ముందుకు వెళుతుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో కీల‌క ప్ర‌సంగం చేసిన వెంక‌య్య‌... తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బ‌లీయ‌మైన శ‌క్తిగా ఎద‌గాలని ఆకాంక్షించారు. తెలంగాణ‌లో పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లు పోరాటాల‌కు సిద్ధం కావాలని సూచించారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలే బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆయుధాలుగా ఉన్నాయ‌ని చెప్పారు. పార్టీ సిద్ధాంతాల‌పై రాజీ ప‌డొద్దని సూచించిన ఆయ‌న‌... మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌కు బీజేపీ వ్య‌తిరేకంగా ఉంద‌ని చెప్పారు. ఈ వైఖ‌రిలో ఎలాంటి మార్పు రాబోద‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/