Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ ఎంపీలకు కొత్త పాపం పులిమిన వెంకయ్య!

By:  Tupaki Desk   |   18 Sep 2016 4:57 AM GMT
కాంగ్రెస్‌ ఎంపీలకు కొత్త పాపం పులిమిన వెంకయ్య!
X
రాష్ట్ర విభజన పర్వం అనేది గతించిన చరిత్ర - దాని పర్యవసానంగా ప్రత్యేకహోదా అందకపోవడం అనే ఘోరం గురించిన వేదనలోనే ప్రస్తుతం మన రాష్ట్రం ఉన్నది. అయితే.. విభజన నిందలు భరించే పరిస్థితి ఇప్పటికీ కాంగ్రెస్‌ మాజీ ఎంపీలకు తప్పడం లేదు. అప్పట్లో రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలుగా ఉన్న వారందరూ కూడా విభజన ను వ్యతిరేకించి, సమైక్యాంధ్ర కావాలని గళం విప్పిన వారే అనేది అప్పటి జనాభిప్రాయం. ఎవరో పురందేశ్వరి వంటి కొందరు అవకాశవాదులు తప్ప.. అందరూ కూడా సమైక్యాంధ్రకు అనుకూలంగా పోరాడారనే పేరు జనం వద్ద తెచ్చుకున్నారు. విభజన జరగడానికి అప్పటి కాంగ్రెస్‌ ఎంపీల చేతగానితనమే కారణం అని అందరూ నిందిస్తుంటారు. పవన్‌ కల్యాణ్‌ కూడా తన సభలో వారిని ఎంత చులకనగా దూషించాడో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అప్పటి కాంగ్రెస్‌ ఎంపీలకు కొత్త పాపం ఒకటి పులుముతున్నారు.

అప్పట్లో రాష్ట్ర విభజనకు సోనియా నిర్ణయం తీసుకున్న తరువాత, వెంకయ్యనాయుడు మన రాష్ట్రానికి చెందిన సమైక్యాంధ్రను డిమాండ్‌ చేస్తున్న ఎంపీలందరికీ స్వయంగా చెప్పారుట. విభజన జరగబోతోంది.. మీరు సమైక్యాంధ్ర డిమాండ్‌ మానేసి.. కనీసం రాష్ట్రానికి ఏం కావాలో.. సోనియాను అడగండి - ఆ సంగతులు చట్టంలోకి వస్తాయి లేకపోతే రెండు విధాల నష్టపోతాం అని హితవు చెప్పారుట. అయితే కాంగ్రెస్‌ ఎంపీలు ఆయన మాట చెవిన వేసుకోలేదుట.

''విభజన జరగడం లేదు, సోనియాకు సన్నిహితులైన ఓ నాయకుడు మాకు చెప్పారు. మాకు తెలుసు.. జరగదు'' అంటూ వారు వెంకయ్యకు ఎదురు సమాధానం చెప్పారే తప్ప.. తమ రాష్ట్రానికి కావాల్సిన పథకాలు - ఏర్పాట్ల గురించి బిల్లు సభకు వచ్చేవరకు సోనియాను అడగనే లేదుట. అందువల్ల రాష్ట్రం ఎక్కువగా నష్టపోయిందని, తాను చెప్పిన హితవు వినిఉంటే ఏపీకి చాలా మేలు జరిగి ఉండేదని వెంకయ్యనాయుడు తన సన్మాన సభ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఆ రకంగా.. కాంగ్రెస్‌ ఎంపీలు అప్పట్లో పాల్పడిన ఒక కొత్త పాపం ఇవాళ ఇలా వెలుగులోకి వచ్చిందన్నమాట.