Begin typing your search above and press return to search.

ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   21 Dec 2022 1:30 PM GMT
ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు!
X
ఉచిత పథకాలతో లబ్ధిదారులకు కలిగే ఆనందం తాత్కాలికమేనని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సంపాదించడం నేర్పకపోతే ప్రగతి సాధించలేరని కుండబద్దలు కొట్టారు. అన్నార్తులకు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడంలో తప్పులేదన్నారు. విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థుల పట్టభద్రుల దినోత్సవానికి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

'ప్రధాని మోదీ కాన్వెంట్లకు వెళ్లి చదువుకోలేదు. ప్రస్తుత రాష్ట్రపతి, నేను, ఇటీవలే పదవీ విరమణ చేసిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. అందరం మాతృభాషలో చదువుకునే ఉన్నత స్థానాలకు ఎదిగాం. ప్రభుత్వాలు ఏ భాషనూ జనంపై రుద్ద కూడదు' అని వెంకయ్య నాయుడు హాట్‌ కామెంట్స్‌ చేశారు. మాతృభాష కనుచూపు లాంటిదని.. విదేశీ భాష కళ్ల జోడు లాంటిదని చెప్పారు.

ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత పథకాలపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులోనూ ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. ఉచిత పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ప్రభుత్వాలు సోమరులు చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది పన్నులు రూపంలో కట్టిన సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు పెట్టకుండా కొన్ని వర్గాలకు లబ్ది చేకూర్చడానికి వినియోగించడంపై విమర్శలు ఉన్నాయి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లో ఇలా అనేక ఉచిత పథకాలను అమలు చేయడం వల్లే ఏపీ ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటోందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే వెంకయ్య నాయుడు హాట్‌ కామెంట్స్‌ చేశారు. అలాగే ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు, బాషా నిపుణులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు, అయితే ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియం విషయంలో ముందుకే వెళ్లింది.

ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. గతంలో వెంకయ్య నాయుడు ఇంగ్లిష్‌ మీడియం విధానంపై విమర్శలు చేసినప్పుడు ఆయనపై ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలు ఖండించారు. ఇప్పుడు ఈ తాజా వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.