Begin typing your search above and press return to search.

పాచి మాటల్నే మళ్లీ చెప్పారు

By:  Tupaki Desk   |   11 Sep 2016 9:08 AM GMT
పాచి మాటల్నే మళ్లీ చెప్పారు
X
కాకినాడ సభలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉగ్రరూపాన్ని సీమాంధ్ర ప్రజలే కాదు.. ఆయన్ను అభిమానించే వారూ.. వ్యతిరేకించే వారూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. తూటాల్లాంటి మాటలతో పలువురికి కరెంటు షాక్ కొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉండటాన్ని మర్చిపోలేం. ఆయన మాటల ప్రభావం ఎంతన్న విషయాన్న మదింపు చేస్తే.. గంటల వ్యవధిలో ఏపీకి బీజేపీ నేతల్ని ప్రధానితో భేటీకి బీజేపీ అధినాయకత్వం పిలవటం ఒకటైతే.. కాకినాడ సభలో పూర్తిగా టార్గెట్ అయిన వెంకయ్య.. గడిచిన రెండు రోజులుగా తన వాదనను పదే పదే చెప్పుకుంటూ.. అటు పవన్ ను నేరుగా విమర్శించలేక సతమతమవుతున్నారు.

తానేం తప్పు చేయలేదని.. తమ సర్కారు ఏపీ ప్రజలకు ఎలాంటి అన్యాయం చేయలేదన్న వాదనను వినిపించే ప్రయత్నంలో ఆయన పలు విషయాల్ని చెప్పుకొచ్చారు. అయితే.. ఇవన్నీ గతంలో వెంకయ్య అండ్ కో ప్రస్తావించిన అంశాలే కావటం గమనార్హం. పవన్ కల్యాణ్ మాటల్లో చెప్పాలంటూ పాచిపోయిన మాటల్ని పదే పదే చెప్పిన వెంకయ్య.. ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యల్ని చూస్తే..

= విభజన వల్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలుగు ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే పని చేస్తున్నాం. విభజన చట్టం ఏర్పాటులో లొసుగులు ఉన్నాయి. విభజన సమయంలో ఏడు రోజుల పాటు కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు జరిపాను. విభజనను సమర్థిస్తూనే.. ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు శక్తి మేర ప్రయత్నించా.

= పోలవరం నిర్మాణానికి 35 ఏళ్లుగా ఏమీ చేయకుండా.. రెండేళ్లలో చేయాలంటున్నారు. ఏపీపై ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే పోలవరానికి అడ్డంకులు తొలిగించే ప్రయత్నం చేశాం.

= ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాడింది కేవీపీ రామచంద్రరావు ఒక్కరే. విభజన సమయంలో ఇచ్చిన హామీలు చట్టరూపంలో వస్తాయని భావించినా.. అవి చట్ట రూపం దాల్చలేదు. ఏపీకి రూ.2.25లక్షల కోట్లతో ప్రాజెక్టులు వస్తున్నాయి. చరిత్రలో ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం ఈ విధంగా సాయం చేయలేదు.

= ఏపీ అభివృద్ధి హోదాతోనే సాధ్యమవుతుందన్నది కొందరి వాదన. హోదాతో కొంత మేలు జరుగుతుందనటంలో అనుమానం లేదు. అయితే.. హోదాకు మించి లాభం చేయాలన్నదే మా ఆలోచన.

= ఐఐటీ.. ఐఐఐటీ.. ఎయిమ్స్ లాంటి ప్రముఖ సంస్థలు ప్రత్యేక హోదాతో రావు. ఏపీ గురించి అరుణ్ జైట్లీతో 70సార్లు మాట్లాడా.ప్రత్యేక దృష్టి.. సాయంతోనే ఏపీ నిలదొక్కుకుంటుంది. విభజనతో ఏపీకి రూ.22వేల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. ఆ లోటును భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

= విదేశీ రుణాన్నిరాష్ట్రానికి తెచ్చి.. ఆ రుణాన్ని కేంద్రమే భరించేలా చేస్తున్నాం. ఇది ఏపీకి మాత్రమే. స్మార్ట్ సిటీ జాబితాలో అమరావతిని చేర్చాలని భావిస్తున్నాం. ప్యాకేజీ పాచిపోయిందంటూ కొందరు విమర్శిస్తున్నారు. కానీ.. అదనంగా ఇచ్చే డబ్బు పాచిపోతుందా? కేంద్ర సహకారం లేనిదే రాష్ట్రాలు అభివృద్ధి బాట పట్టలేవు.