Begin typing your search above and press return to search.

వెంక‌య్య మొత్తం జాత‌కం చ‌దివేశాడు

By:  Tupaki Desk   |   11 Feb 2017 6:02 PM GMT
వెంక‌య్య మొత్తం జాత‌కం చ‌దివేశాడు
X
కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై స్పందించారు. హైద‌రాబాద్‌లో జ‌రిగి పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సమర్పణ దివస్ కార్యక్రమానికి వెంక‌య్య హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడుతో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర నేత‌లు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో బీజేపీ కి ఎటువంటి పాత్ర లేదని వెంక‌య్య నాయుడు వివ‌రించారు. త‌మిళ‌నాడు సీఎం ఎవరనేది బీజేపీ నిర్ణయం చేయలేదని తెలిపారు. త‌మ‌కు అసెంబ్లీలో బలం లేదని తెలిపారు. త‌మిళ‌నాడులోని పరిస్థితులు భాదాకారమ‌ని వెంక‌య్య అన్నారు. వాళ్లలో వాళ్ళు తేల్చుకోవాలని, గవర్నర్ పరిధి లోని అంశం కాద‌ని అన్నారు.

బీజేపీ వ్య‌వ‌స్థాప‌కుల్లో కీల‌క‌నేత అయిన దీన్ దయాల్ ఉపాధ్యాయ అనుమానస్పదంగా చనిపోతే విచారణ కూడా జరపని చ‌రిత్ర కాంగ్రెస్ ద‌ని మండిప‌డ్డారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయని, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాజీ ప్ర‌ధాని మన్మోహన్ ఫై చేసిన బాత్ రూమ్‌లో రెయిన్ కోట్ స్నానం కామెంట్‌ సానుకూలంగా చూడ‌వ‌ల‌సిందేన‌ని వెంక‌య్య‌నాయుడు అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకులకు స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం లేదని, వాళ్లలో ఒక్కరు కూడా దేశం కోసం త్యాగం చేయలేదని తెలిపారు. పైగా దేశంలోనే ఉద్దండులైన సీతారాం కేసరి, పీవీ నరసింహారావు వంటి మహామహులను తీవ్రంగా అవమానించిన ఘ‌న‌త‌ కాంగ్రెస్ పార్టీద‌ని వెంక‌య్య‌నాయుడు మండిప‌డ్డారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్ర పటాన్ని పార్లమెంట్ లో పెట్టకుండా ఆలస్యం చేసింది కాంగ్రెస్ అని వెంక‌య్య వివ‌రించారు. సామాన్య స్థాయి నుంచి వచ్చిన న‌రేంద్ర‌మోడీ ప్ర‌ధాన‌మంత్రి కావడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. కాంగ్రెస్ కుటుంబ పాలనకు నిలయమన్నారు. కుర్చీ కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా అరాచకాలు చేసిందని తెలిపారు. పార్టీ నుంచి అందరు వదిలి వెళ్తున్నార‌నే ఆవేద‌న‌లో కాంగ్రెస్‌ పార్టీ ఉంద‌ని అన్నారు. మోడీకి లభిస్తున్న ఖ్యాతిని చూసి కాంగ్రెస్ అసూయ పడుతోందని చెప్పారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధిస్తుందని వెంక‌య్య నాయుడు ధీమా వ్య‌క్తం చేశారు.