Begin typing your search above and press return to search.

వాళ్లను తిట్టేటోళ్లంతా దిష్టిబొమ్మల పార్టీలంట

By:  Tupaki Desk   |   16 Nov 2015 8:35 AM GMT
వాళ్లను తిట్టేటోళ్లంతా దిష్టిబొమ్మల పార్టీలంట
X
ప్రస్తుతం గుంటూరులో పర్యటిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు లాం ఫారంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని దోచుకున్న నేతలంతా ఇప్పుడు ప్రధాని మోడీని విమర్శలు చేస్తున్నారంటూ మండిపడిన వెంకయ్య.. తమపై విమర్శలు చేసే వారిని దిష్టిబొమ్మల పార్టీలుగా అభివర్ణించటం విశేషం. దిష్టిబొమ్మల పార్టీకి గత ఎన్నికల్లో ఒక్క సీటులో ప్రజలు గెలిపించలేదని వెంకయ్య దుయ్యబట్టారు.

దిష్టిబొమ్మల పార్టీలు కొన్ని.. వేరే పని ఏమీ లేకుండా దిష్టిబొమ్మల్ని తగలబెట్టటమే పనిగా పెట్టుకుంటుందన్నారు. ఏపీలోని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అన్నీ జిల్లాల్ని అభివృద్ధే లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక.. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ.. తాను ఈ అంశంపై ఎవరూ మాట్లాడని సమయంలోనే తాను మట్లాడానని గుర్తు చేశారు. తాను ఏపీ నుంచి ఎంపీగా ఎంపిక కాకున్నా.. తెలుగువారికి అన్యాయం జరుగుతుందని భావించి తాను ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించానని చెప్పారు. కర్ణాటక నుంచి తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని చెప్పుకొచ్చిన వెంకయ్య ఆంధ్రులకు అన్యాయం జరుగుతుందనే తాను ఆ రోజు మాట్లాడానన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో పాటు.. ఏ విధంగా సాయం చేయాలన్న విషయంపై నిర్ణయం కోసం నీతి అయోగ్ కు బాధ్యత అప్పగించిన విషయాన్ని వెంకయ్య గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? ప్యాకేజీ వస్తుందా? అన్న విషయం తాను చెప్పలేనని.. కాకుండా ప్రత్యేకహోదా కంటే ఎక్కువ సాయం కేంద్రం నుంచి వస్తుందన్నారు. మోడీ ఆ దిశగా కృషి చేస్తున్నారన్న వెంకయ్య.. దేశం మొత్తానికి న్యాయం చేస్తున్న మోడీ.. ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా మీద కొత్త సంగతులేమీ మాట్లాడకుండానే సీమాంధ్రుల కడుపులు నిండిపోయేలా మాటలు మాత్రం వెంకయ్య చెప్పారని చెప్పొచ్చు.