Begin typing your search above and press return to search.

దేశం దాకా ఎందుకు? 5 రాష్ట్రాల మాటేంటి వెంకయ్యా?

By:  Tupaki Desk   |   7 March 2016 4:46 AM GMT
దేశం దాకా ఎందుకు? 5 రాష్ట్రాల మాటేంటి వెంకయ్యా?
X
కేందమంత్రి వెంకయ్యనాయుడు ఎంతటి మాటకారి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడటం మొదలు పెడితే.. అంత్యప్రాసలతో ఎదుటోడి నోరును తెరవకుండా చేస్తుంటారు. అయితే.. అదంతా వెంకయ్య మాటల్లోని లాజిక్ తో కాదు.. కేవలం ఆయన మాటల హడావుడితోనే. తాజాగా రాజమహేంద్రవరానికి వచ్చిన ఆయన.. ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

అండమాన్ నికోబార్ దీవులు మొదలు అరుణాచల్ ప్రదేశ్.. కన్యాకుమారి.. కశ్మీర్.. రాజమహేంద్రవరం ఇలా అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా దేశం మొత్తం బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా చెప్పుకొచ్చారు. కాన్ఫిడెన్స్ ఉండటం తప్పే కాదు. కానీ.. అది మరీ ఓవర్ గా ఉండటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇంత బడాయిగా మాట్లాడుతున్న వెంకయ్య సూటిగా ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

మరికొద్ది రోజుల్లో నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయ్యింది కూడా. మరి.. ఈ నాలుగు (తమిళనాడు.. కేరళ.. అసోం.. పశ్చిమబెంగాల్) రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతం (పుదుచ్చేరి)కి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నిచోట్ల బీజేపీ విజయఢంకా మోగిస్తుందో..? ఒకే ఒక్క మాటలో వెంకయ్య సమాధానం చెప్పగలరా? మాటలు చెబితే మంచిదే.. కానీ.. ఆ మాటలు అతికేలా ఉండాలే కానీ.. ఆర్భాటం కోసం చెప్పినట్లుగా ఉండకూడదు. అందులోకి వెంకయ్య స్థాయి నేతల నోటి నుంచి అస్సలే రాకూడదు. కానీ.. వెంకయ్య నోటి నుంచి మాత్రం తరచూ బడాయి మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.