Begin typing your search above and press return to search.

హ‌ఠాత్తుగా వెంక‌య్య ఢిల్లీ వెళ్లింది ఇందుకోస‌మేనా?

By:  Tupaki Desk   |   23 April 2018 7:54 AM GMT
హ‌ఠాత్తుగా వెంక‌య్య ఢిల్లీ వెళ్లింది ఇందుకోస‌మేనా?
X
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం తన పర్యటన ముగించుకొని ఢిల్లీకి వెళ్లారు. ఆదివారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు...ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం టాటా ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొని.. స్వర్ణ భారత్ ట్రస్టును సందర్శించి ఢిల్లీకి వెళ్లవలిసి ఉంది. కానీ అకస్మాతుగా ఆదివారం తన పర్యటన ముగించుకొని ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి దీపక్ మిశ్రాపై కాంగ్రెస్ సహా ఏడు విపక్షపార్టీల ఎంపీలు అభిశంసన నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారమే ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన కోసం ఇచ్చిన తీర్మానాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరస్కరించారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సహా ఏడు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన తీర్మానంపై న్యాయకోవిదుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వెంకయ్యనాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిశంసన నోటీసుపై కాంగ్రెస్ - సీపీఎం - సీపీఐ - ఎస్‌ పీ - ఎన్సీపీ - బీఎస్పీ - ముస్లిం లీగ్ సభ్యులు సంతకాలు చేశారు. మొత్తం ఐదు రకాల దుష్ప్రవర్తన ఆధారంగా ఈ నోటీసు తీసుకువచ్చాయి ప్రతిపక్ష పార్టీలు. ఇప్పటి వరకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు జారీ అయినప్పటికీ అసాధారణ రీతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి.

సీజేఐపై ప్ర‌తిప‌క్షాలు ఆరోపణలు ఇవే...

* ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కేసు విషయంలో ముడుపులు తీసుకున్నారు. ఇదే కేసులో రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వలేదు.

* సుప్రీంకోర్టులో ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ పై విచారణకు సంబంధించిన పిటిషన్‌ ను ముందు తేదీకి మార్చటం

* రాజ్యాంగ ధర్మాసనానికి తనే నేతృత్వం వహిస్తున్నప్పటికీ ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కు సంబంధించిన విచారణను తన బెంచీకే కేటాయించటం సంప్రదాయానికి విరుద్ధం.

* న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తప్పుడు అఫిడవిట్‌ తో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. 2012లో తను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందినపుడు దీన్ని సరెండర్‌ చేశారు. అయితే 1985లోనే ప్లాట్‌ కేటాయింపు నిబంధనలు రద్దుచేశారు. అప్పటినుంచి వీటిని సీజేఐ ఉల్లంఘించారు.

* తనకున్న మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సున్నితమైన అంశాలను కొన్ని ప్రత్యేక ధర్మాసనాలకు కట్టబెట్టారు.