Begin typing your search above and press return to search.

నామినేష‌న్‌ తోనే... రికార్డు పుట‌ల్లోకి వెంకయ్య!

By:  Tupaki Desk   |   18 July 2017 10:11 AM GMT
నామినేష‌న్‌ తోనే... రికార్డు పుట‌ల్లోకి వెంకయ్య!
X
ఉషాప‌తిగా ఉండ‌ట‌మే త‌న‌కిష్ట‌మ‌ని, అలాంటిది రాష్ట్రప‌తిగా తాను వెళ్ల‌బోన‌ని ప‌దే ప‌దే చెప్పిన బీజేపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు... పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేర‌కు ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేశారు. కాసేప‌టి క్రితం అధికార కూట‌మి ఎన్డీఏ అభ్య‌ర్థిగా వెంక‌య్య‌నాయుడు నామినేష‌న్ వేశారు. ఉప‌రాష్ట్రప‌తిగా వెంక‌య్య ఎన్నికైతే... ఆయ‌న పేరిట ఓ అరుదైన రికార్డు న‌మోదు కానుంది. ఇప్ప‌టిదాకా ఉప‌రాష్ట్రప‌తులుగా ప‌నిచేసిన వారంతా కూడా దేశానికి స్వాతంత్య్రం రాక‌ముందు జ‌న్మించిన వారేన‌ట‌. అంతేకాదండోయ్‌... ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేసి ఇప్ప‌టిదాకా నామినేష‌న్ దాఖ‌లు చేసిన వారంతా కూడా స్వాతంత్య్రం రాక‌ముందు పుట్టిన వారేన‌ట‌. అయితే కాసేప‌టి క్రితం ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన వెంక‌య్య‌నాయుడు మాత్రం... దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత జ‌న్మించి ఉప‌రాష్ట్రప‌తిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన తొలి వ్య‌క్తిగా రికార్డు పుటల్లోకి ఎక్కారు.

ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల బరిలోకి దిగిన వెంక‌య్య‌నాయుడు... ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఎందుకంటే... నిన్న ముగిసిన రాష్ట్రప‌తి ఎన్నికలో అధికార పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన రామ్‌ నాథ్ కోవింద్‌ కు ఏ స్థాయిలో మ‌ద్ద‌తు ల‌భించిందో తెలిసిందే. అయితే ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఉప‌రాష్ట్రప‌తి బ‌రిలోకి దిగిన వెంక‌య్య‌నాయుడుకు కూడా కోవింద్ కు ద‌క్కిన స్థాయిలోనే ఒక‌టి అరా పార్టీల నుంచి మిన‌హాయిస్తే దాదాపుగా అన్ని పార్టీల సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భించడం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో వెంక‌య్య‌నాయుడు ఉప‌రాష్ట్రప‌తిగా ఎన్నిక‌వ‌డం న‌ల్లేరుపై న‌డకేన‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే... స్వాతంత్య్రానంత‌రం జ‌న్మించి భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి వ్య‌క్తిగా వెంక‌య్య మ‌రో రికార్డును త‌న సొంతం చేసుకోనున్నారు.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఇప్ప‌టికే వెంక‌య్య‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. స్వాతంత్య్రానంత‌రం జ‌న్మించి భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న తొలి నేత వెంకయ్యేన‌ని, ఆయ‌న‌కు ఇవే నా అభినంద‌న‌లు అని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అశోక్ మాలిక్ ట్విట్ట‌ర్‌ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా త‌న పేరును ప్ర‌క‌టించిన వెంట‌నే వెంక‌య్య త‌న కేంద్ర మంత్రి ప‌ద‌వికి, బీజేపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో వెంక‌య్య నిన్న‌టిదాకా ప‌ర్య‌వేక్షించిన స‌మాచార ప్ర‌సార శాఖ‌ను మ‌రో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి, ప‌ట్ట‌ణాబివృద్ధి శాఖ‌ను న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌కు అప్పగిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.