Begin typing your search above and press return to search.

వెంకయ్య.. శ్రీమంతుడిలో జగపతిబాబు

By:  Tupaki Desk   |   27 Aug 2015 5:54 PM GMT
వెంకయ్య.. శ్రీమంతుడిలో జగపతిబాబు
X
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇటీవల ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు గుర్తుందా? శ్రీమంతుడి సినిమా చూస్తే నన్ను నేనే చూసుకున్నట్లు ఉందని ఆయన అన్నారు. నా గ్రామం అంటే నాకు ఎంతో ఇష్టమని కూడా చెప్పారు. ఆయన వ్యాఖ్యను చాలామంది చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. శ్రీమంతుడి సినిమా చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు ఉందని వెంకయ్య నాయుడు అంటే ఆయనను చాలామంది మహేశ్ బాబు అని అనుకున్నారు. కానీ, ఇక్కడ వెంకయ్య నాయుడు వ్యాఖ్య నిజమే కానీ అందులో ఆయన మహేశ్ బాబు కాదని, ఆయన తండ్రి జగపతిబాబు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు.

శ్రీమంతుడి సినిమాలో జగపతిబాబుకు తన ఊరు అంటే వల్లమాలిన అభిమానం. ప్రేమ. దానిని అభివృద్ధి చేయాలని అనుకుంటాడు. చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఆయనకు ఎదురు దెబ్బ తగులుతుంది. దానిని తట్టుకోలేక ఆయన ఊరు ప్రజలను తప్పుబట్టి ఊరు వదిలి వెళ్లిపోతాడు. ఊరు వదిలి వెళ్లిపోయి వేల కోట్లకు అధిపతి అవుతాడు. రాజకీయాల్లో వెంకయ్య నాయుడిది కూడా ఇదే తీరు. మూడు నాలుగు దశాబ్దాల కిందట ఆయన జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత నెల్లూరుకు వచ్చి అక్కడ ఉదయ గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. ఒకసారి గెలిచి అసెంబ్లీకి వెళ్లాడు కూడా. అప్పట్లో అసెంబ్లీలో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి వంటి వాళ్లు తమ వాగ్ధాటితో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేవాళ్లు. అయితే, ఒకసారి తర్వాత నెల్లూరు ప్రజలు వెంకయ్యకు అవకాశం ఇవ్వలేదు. ప్రజలు అవకాశం ఇవ్వలేదు అనే కంటే నెల్లూరులోని రెడ్ల రాజకీయాల ముందు వెంకయ్య నాయుడు నిలవలేకపోయాడని అనవచ్చేమో. దాంతో నెల్లూరు తన కంచుకోట అని చెప్పుకొన్నా అక్కడి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఎప్పుడూ గెలవలేదు. అనంతర కాలంలో కాలం కలిసి వచ్చి.. తన వాగ్ధాటితో బీజేపీలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. అక్కడ అంచెలంచెలుగా పార్టీ అధ్యక్షుడు అయ్యారు. అయినా నెల్లూరులో ఏనాడూ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోకి దూకే సాహసం చేయలేదు. నెల్లూరులోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కడా ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఇటు పార్లమెంటు, అటు అసెంబ్లీకి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే అప్పట్లో బీజేపీ కర్ణాటకలో అధికారంలో ఉండేది. కనక అక్కడి నుంచి ఆయనను రాజ్యసభకు పంపించింది. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనక అప్పటి నుంచి ఇప్పటి వరకు కర్ణాటక నుంచే ఆయన రాజ్యసభకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కు చెందినా బీజేపీకి ఇక్కట పట్టు లేదు కనక ఆయనకు రాజ్యసభ సభ్యత్వం దక్కలేదు.

దాంతో, తాను ఎంతో గొప్ప నాయకుడిని అయినా.. తాను బీజేపీలో జాతీయ అధ్యక్షుడిని అయినా.. వాజపేయి, అద్వానీ వంటి వాళ్లకు సన్నిహితుడిని అయినా.. రెండుసార్లు కేంద్ర మంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనను ఆదరించలేదనేది వెంకయ్యనాయుడు తరచూ చెప్పే మాట. ఇప్పుడు నేను కూడా వేల కోట్ల రూపాయలకు అధిపతిని అయ్యానని, అయినా సొంత రాష్ట్రం తనను ఆదరించడం లేదని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన శ్రీమంతుడి సినిమాలో మహేశ్ బాబు కాదని జగపతి బాబు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే స్వర్ణ భారతి అనే ట్రస్టును పెట్టి సొంత ఊరికి ఏదో చేస్తున్నానని చెబుతున్నా అది కేవలం రాజకీయాల కోసమేనని, దాని వెనక ఉద్దేశం వేరేననే నాయకులూ లేకపోలేదు. ఇప్పుడు వెంకయ్య నాయుడు తాను వచ్చినప్పుడల్లా ఏపీకి ఒక ప్రాజెక్టు తీసుకు వస్తున్నానని, నేను రాకపోతే మీకు ప్రాజెక్టు రాదని, రావద్దంటే మానేస్తానని కూడా వ్యాఖ్యానించారు. వాస్తవానికి, నవ్యాంధ్రకు ప్రాజెక్టులు రావడంలో ఆయన కూడా కొంత కృషి చేసి ఉండవచ్చేమో కానీ ఆయన వల్లే వచ్చాయనడం తప్పని వివరిస్తున్నారు. ఏపీకి ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్టులన్నీ విభజన చట్టంలో పేర్కొన్నవేనని, విభజన చట్టంలోని ప్రాజెక్టులు తప్పితే ఆయన మరొక్కటి అదనంగా ఇచ్చింది లేదని వివరిస్తున్నారు. ఇప్పడు స్మార్ట్ సిటీల ప్రకటనలో ఆయన వైఖరి మరింత సుస్పష్టం అయిందని వివరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీలను ప్రకటించిన వెంకయ్య నాయుడు.. తాను కట్టే అడ్డ పంచెకు అనుగుణంగా తమిళనాడుకే పెద్దపీట వేశారు. ఆయనకు ఆయన కుటుంబానికి తమిళనాడులోనే ఆస్తులు ఉన్నాయి కనక దానికే పెద్దపీట వేశారనే ఆరోపణలూ లేకపోలేదు. ఉత్తరాదికి సంబంధించి ఉప్రదేశ్ కు పెద్దపీట వేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, దక్షిణాదిలో అన్నిటికంటే అధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం తమిళనాడు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమిళనాడుకే అన్ని నిధులు, ప్రాజెక్టులు కట్టబెడుతున్నారు. వెంకయ్య నాయుడు కూడా అదే చేశారు. తమిళనాడుకు ఏకంగా 12 నగరాలను ఎంపిక చేశారు. దాని పక్కనే ఉన్న కర్ణాటక నుంచి ఆరు నగరాలు ఎంపిక చేశారు. అక్కడ బీజేపీ ప్రతిపక్షంలో ఉంది కనక ఆరు ఎంపిక చేశారు. లేకపోతే ఇంకా ఎక్కువ చేసి ఉండేవారు. కానీ, రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన నవ్యాంధ్రలో కేవలం మూడే మూడు నగరాలను ఎంపిక చేశారు. అందులోనూ విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలను ఎంపిక చేశారు. ఇక తెలంగాణలో రెండు నగరాలను ఎంపిక చేశారు. వరంగల్, హైదరాబాద్ లకు పెద్దపీట వేశారు. రెండు తెలుగు రాష్ట్రాలనూ కలిపినా మనకు వచ్చింది కేవలం ఐదే ఐదు స్మార్ట్ సిటీలు. కానీ, పక్కనున్న తమిళనాడుకు మనకంటే రెట్టింపు కంటే ఎక్కువ. కర్నాటకకూ మన కంటే ఎక్కువ. మహారాష్ట్రలో పది ఎంపిక చేస్తే మధ్యప్రదేశ్ లో ఏడు ఎంపిక చేశారు. ఏ విధంగా చూసినా తెలుగు రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా నవ్యాంధ్రకు వెంకయ్య నాయుడు అన్యాయం చేశారని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. కనీసం ఆయన సొంత జిల్లా నెల్లూరును కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే నెల్లూరును కూడా ఆయన స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చలేదు. నవ్యాంధ్ర మీద వెంకయ్య నాయుడు పూర్తి స్థాయిలో వివక్ష చూపించారని, స్మార్ట్ సిటీల జాబితాలో ఆయన వివక్ష కళ్లకు కట్టినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. తెలుగు వాడినంటూ వెంకయ్య చెప్పే మాటలన్నీ నాలుక చివరి నుంచి వచ్చేవేనని వివరిస్తున్నారు.