Begin typing your search above and press return to search.

మోడీ.. వెంకయ్యకు కాదు.. ప్రజలకు దేవుడా?

By:  Tupaki Desk   |   24 March 2016 5:50 AM GMT
మోడీ.. వెంకయ్యకు కాదు.. ప్రజలకు  దేవుడా?
X
మాటల్ని ట్విస్ట్ చేయటంలో రాజకీయ నాయకుల తర్వాతే ఎవరైనా. ఏదో ఒక వ్యాఖ్య చేయటానికి.. అది కాస్తా వివాదాస్పదం అయిన వెంటనే ప్లేట్ తిప్పేసి.. అయితే మీడియా మీద కానీ.. లేదంటే జనం మీద కానీ పడిపోవటం పొలిటీషియన్స్ కు అలవాటే. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ మధ్య బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన కేంద్రమంత్రి వెంకయ్య.. మోడీ దేవుడిచ్చిన వరమంటూ వ్యాఖ్యలు చేయటం.. ప్రధానిపై మరీ ఈ స్థాయిలో పొగడ్తలు అవసరమా? అన్న విమర్శలు వినిపించాయి.

దీనికి తగ్గట్లే వెంకయ్య వ్యాఖ్యలపై ఆర్ ఎస్ ఎస్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిపూజ పార్టీకి మంచిది కాదని.. మరీ ఈ స్థాయిలో పొగడటం ఏమిటంటూ వెంకయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వెంకయ్య వ్యాఖ్యలపై తమకున్న ఆగ్రహాన్ని బీజేపీ అధినాయకత్వానికి సంఘ్ పరివార్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

బీజేపీకి అమ్మ లాంటి సంఘ్ కు ఆగ్రహం వస్తే తనకొచ్చే తిప్పలు తెలిసిన వెంకయ్య.. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాను మోడీని దేవుడని అనలేదని... మోడీ దేవుడిచ్చిన వరంగా ప్రజలు అనుకుంటున్న విషయాన్ని మాత్రమే తాను చెప్పానని.. అంతకు మించి తానేం మాట్లాడలేదని చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే.. తన మాటల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల తన వ్యాఖ్యలు తప్పుగా వచ్చినట్లుగా ఆయన వివరణ ఇచ్చారంటున్నారు. ఇంతకీ.. మోడీని దేవుడిచ్చిన వరంగా ఏ ప్రజలు వెంకయ్యకు చెప్పారో చెబితే.. మిగిలిన జనం కూడా ఆనందిస్తారు? మరి.. ఆయనకు ఆ ఫీడ్ బ్యాక్ ఇచ్చిన ప్రజా సమూహం ఏదో చెప్పి పుణ్యం కట్టుకుంటే బాగుంటుందేమో..?