Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు అడ్డుతగులుతున్న వెంకయ్య

By:  Tupaki Desk   |   31 Jan 2016 9:08 AM GMT
చంద్రబాబుకు అడ్డుతగులుతున్న వెంకయ్య
X
తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికల పోలింగ్ కు ముందు వెంకయ్యనాయుడు తన వ్యాఖ్యలతో బీజేపీ-టీడీపీ అభ్యర్థులకు చేటు చేస్తున్నారన్న విమర్శలు రెండు పార్టీల నుంచి వస్తున్నాయి. ఇంతకుముందు వరంగల్ ఉప ఎన్నికల సందర్భంలో ఆయన పేదలకు ఇళ్లను ప్రకటించి ఏపీకి భారీగా, తెలంగాణ స్వల్పంగా ప్రకటించి అవకాశాలను దెబ్బతీశారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల సమయంలోనూ స్మార్ట్ సిటీలను ప్రకటించి అందులో తెలంగాణలోని ఏ నగరానికి ఛాన్సు లేకుండా ప్రకటించారు. దీంతో సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. ఎన్నికలు అయ్యేవరకు ఈ ప్రకటన ఆపితే బాగుండేదని భావించారు. అయితే.... వెంకయ్యనాయుడు అక్కడితో ఆగకుండా తాజాగా మరో బాంబు పేల్చారు. హైదరాబాద్ అభివృద్దిపై స్పష్టమైన వివరాలతో ఎవరు ఎలా చేశారో చెబుతూ టీడీపీ మంచి అభివృద్ధి చేసిందని... తన హయంలో 9 ఏళ్ల కాలంలో భాగ్యనగరం భాగ్యవంతంగా మారిందని ప్రజల్లోకి తీసుకెళ్తున్న తరుణంలో వెంకయ్య దానికీ అడ్డుపుల్ల వేశారు. చంద్రబాబు చెబుతున్నదానికి భిన్నంగా చెబుతూ ప్రజలను అయోమయానికి గురిచేశారు. హైదరాబాద్ అభివృద్ధికి ఆద్యుడు మాజీ ప్రధాని వాజ్ పేయి అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో కాస్త హుషారొచ్చినా టీడీపీ నేతలు మాత్రం మండిపడుతున్నారు. రెండు మూడు రోజుల పాటు చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని తిరిగి చేసిన ప్రచారాన్ని వెంకయ్యనాయుడు దెబ్బతీశారని మండిపడుతున్నారు.

హైదరాబాద్ అభివృద్ధికి ఆధ్యుడు వాజ్ పేయి అని... వాజపేయి పథకాలను అమలు చేసిన చంద్రబాబు బాధ్యుడు మాత్రమేనని వెంకయ్య అంటున్నారు. హైదరాబాద్ లో ఎవరూ సెటిలర్లు కారని, అందరూ భారతీయులేనని పేర్కొన్నారు. ఐఎస్ఐఎస్ పట్ల సానుభూతి ప్రదర్శించే వాళ్లు తమపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధిపైనే ప్రధాని మోడీ ఆలోచిస్తున్నారని చెప్పారు. భాజపాకు అనుకూలంగా ఉండేలా వెంకయ్య ప్రచారం చేసుకోవడంలో తప్పేమీ లేదుకానీ మిత్ర పక్షం టీడీపీ అవకాశాలను దెబ్బతీసేలా ఆయన వ్యవహరించడంపై విమర్శలువస్తున్నాయి.