Begin typing your search above and press return to search.

వెంకయ్య నాయుడు.. కనబడుట లేదు

By:  Tupaki Desk   |   18 May 2016 9:51 AM GMT
వెంకయ్య నాయుడు.. కనబడుట లేదు
X
అవి లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ కొనసాగుతున్న రోజులు. తమకు విభజన వద్దే వద్దంటూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అరిచి గీపెడుతున్నారు. ఇక్కడ ఆంధ్రా-రాయలసీమ ప్రజలు కూడా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఐతే లోక్ సభలో ఓ పెద్దాయన లేచి నిలబడ్డారు. విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరగనివ్వనంటూ గళం విప్పారు. ఓపక్క విభజనకు తమ పార్టీ తరఫున పూర్తిగా సహకరిస్తూనే.. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడుతున్న భావన కలిగించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తేనే బిల్లుకు మద్దతిస్తామని మెలిక పెట్టారు. దీనిపై అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రకటన చేసేదాకా ఊరుకోలేదు. హోదా ఐదేళ్లు ఇస్తామంటే.. సరిపోదు పదేళ్లు కావాలని ఎలుగెత్తారాయన.

ఇప్పుడిక వర్తమానంలోకి వద్దాం. ప్రత్యేక హోదా జాన్తానై అంటోంది భాజపా సర్కారు. స్వయంగా ఆర్థిక శాఖ సహాయమంత్రే హోదా ఇచ్చేది లేదంటూ పార్లమెంటులో ప్రకటన చేశారు. అప్పుడు హోదా మీద ప్రకటన చేయాల్సిందే అని.. పైగా పదేళ్లు కావాలని డిమాండ్లు వినిపించిన వెంకయ్య ఇప్పుడు అడ్రస్ లేరు. హోదా ఇవ్వడానికి సాంకేతిక అడ్డంకులున్నాయంటూ ఆ మధ్య సన్నాయి నొక్కులు నొక్కిన వెంకయ్య ఇప్పుడసలు నోరే విప్పడం లేదు. హోదా సహా ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేయాల్సిన సాయాల గురించి గట్టిగా అడగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాన మంత్రితో కీలక సమాశానికి వెళ్తే అక్కడ వెంకయ్య లేకపోవడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ పడుతున్న ఇబ్బందుల గురించి వెంకయ్య కంటే చక్కగా ఇంకెవరు ప్రధానికి వివరించగలరు. చంద్రబాబు చెప్పినవన్నీ ప్రధాని నమ్ముతారన్న గ్యారెంటీ లేదు. కానీ వెంకయ్యకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది కదా. ఆయన ప్రధానికి పరిస్థితి వివరించవచ్చు కదా. ఒకవేళ చంద్రబాబు అబద్ధాలు చెప్పినా వాటిని సవరించవచ్చు కదా. ఈ సమావేశంలో పాల్గొనలేనంత బిజీగా ఉన్నారా నాయుడు గారు. మరి ఉద్దేశపూర్వకంగా ఈ సమావేశానికి దూరమవడంలో ఆంతర్యమేంటో? ఇదంతా చూస్తుంటే వెంకయ్య నాయుడిని ‘బొంకయ్య నాయుడు’ అంటూ సోషల్ మీడియాలో ఏపీ జనాలు వేస్తున్న సెటైర్లు సమంజసమే అనిపిస్తోంది కదూ.