Begin typing your search above and press return to search.

ఆ ఓట‌మే వెంక‌య్య‌ను ఈ స్థాయికి తీసుకెళ్లింద‌ట‌!

By:  Tupaki Desk   |   24 Aug 2018 4:33 AM GMT
ఆ ఓట‌మే వెంక‌య్య‌ను ఈ స్థాయికి తీసుకెళ్లింద‌ట‌!
X
ఏమాట‌కు ఆ మాట ఏ ప‌ద‌విలో ఉన్నా.. త‌న తీరును మార్చుకోకుండా త‌న‌లా ఉండే అతి కొద్దిమంది నేత‌ల్లో వెంక‌య్య‌నాయుడు ఒక‌ర‌ని చెప్పాలి. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌విని చేప‌ట్టిన వెంట‌నే నోటికి తాళం ప‌డ‌టం.. రాజ్యాంగ‌ప‌ర‌మైన ప‌ద‌విలో ఉండ‌టంతో ఆచితూచి మాట్లాడాల్సి రావ‌టం.. ప‌ర్య‌ట‌న‌ల విష‌యంలోనూ కొన్ని ప‌రిమితులు ఎదురుకావ‌టం మామూలే.

అయితే.. ఈ ఇబ్బందుల్ని అధిగ‌మించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌. రాజ్యాంగ ప‌ర‌మైన ప‌ద‌వుల్లో ఉండే ప‌రిమితుల విష‌యంలో మ‌న‌సులో అసంతృప్తి ఉన్నా.. స‌ర్ది చెప్పుకుంటూ.. అప్పుడ‌ప్పుడు ఓపెన్ అవుతున్న ఆయ‌న తీరును ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే. మ‌న‌సులోని అసంతృప్తిని బ‌య‌ట‌పెట్టేందుకు వెంక‌య్య ఎప్పుడూ వెనుకాడ‌లేదు. ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌విని చేప‌ట్టి ఆయ‌న అప్పుడే ఏడాది గ‌డిచింది.

త‌న మిత్రులు కొంద‌రు విజ‌య‌వాడ‌లో ప్ర‌త్యేకంగా ఆత్మీయ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజ‌య‌వాడ వెళ్లిన ఆయ‌న కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు రైతుల‌తో క‌లిసి ఆత్మీయ స‌మావేశాన్ని నిర్వ‌మించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓపెన్ అయ్యారు. గ‌తంలోకి వెళ్లారు. ఆయ‌నేమ‌న్నారంటే..

రాజ్యాంగ ప‌ద‌విలో ఇమ‌డ‌గ‌ల‌నా? అనుకున్నా.. అప్పుడే ఏడాది అయిపోయింది. ఎక్క‌డ‌కు కావాలంటే అక్క‌డ‌కు ప్ర‌యాణం చేయ‌డం.. ఎవ‌రిని కావాలంటే వారిని క‌ల‌వ‌డం.. మ‌న‌సుకు త‌ప్ప‌నిపిస్తే నిర్మొహ‌మాటంగా మాట్లాడ‌టం త‌న స్వ‌భావ‌మ‌ని.. అదే త‌న బ‌ల‌మ‌ని.. అయితే.. ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌విలోకి వ‌చ్చాక అదే కొర‌త‌గా ఉంద‌న్న విష‌యాన్ని చెప్పారు. త‌న బ‌లం త‌న స్నేహితులుగా చెప్పిన వెంక‌య్య వారి మ‌ద్ద‌తుతోనే తానీ స్థాయికి వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు.

ఎన్టీఆర్ హ‌వా ఓ రేంజ్లో ఉన్న వేళ టీడీపీతో ఎలాంటి పొత్తు లేని స‌మ‌యంలోనూ ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి గ‌తంలో వ‌చ్చిన మెజార్టీకి రెట్టింపు మెజార్టీతో తాను గెలిచిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకు తాను ఉద‌య‌గిరి ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు చెప్పాన‌న్నారు.

అదే స‌మ‌యంలో త‌ర్వాతి ఎన్నిక‌ల్లో త‌న‌ను ఆత్మ‌కూరు ప్ర‌జ‌లు ఓడించార‌ని.. వారికి కూడా ధ‌న్య‌వాదాలు తెలిపాన‌ని చెప్పారు. ఎందుకంటే.. ఆ ఎన్నిక‌ల్లో తాను ఓడిపోకుంటే తాను రాష్ట్రంలోనే ఉండిపోయాన‌ని. .ఓట‌మితో ఢిల్లీకి వెళ్లాన‌ని.. పార్ల‌మెంటుకు వెళ్లి అనేక కీల‌క నిర్ణ‌యాల్లో భాగ‌స్వామి అయ్యేందుకు అవ‌కాశం ల‌భించింద‌న్నారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌న‌కు నాలుగు రోజులు నిద్ర లేకుండా చేసింద‌ని.. తాను తీవ్ర‌మైన భావోద్వేగానికి గురైన‌ట్లుగా చెప్పారు. విభ‌జ‌న‌కు తాను వ్య‌తిరేకం కాదు కానీ విభ‌జ‌న చేసిన తీరే ఆందోళ‌న క‌లిగించింద‌న్నారు. వాజ్ పేయి మ‌రణించ‌క ముందు ఆయ‌న బాధ చూడ‌లేక త్వ‌ర‌గా చ‌నిపోవాల‌ని దేవుడ్ని కోరుకున్నాన‌ని.. చ‌నిపోయాక ఉద్వేగానికి లోనైన‌ట్లు చెప్పారు. అట‌ల్ జీ అన్నింట్లోనూ అద్భుత‌మైన వ్య‌క్తిగా అభివ‌ర్ణించారు. ఉప రాష్ట్రప‌తి హోదాలో ఇన్ని మాట‌లు మాట్లాడ‌టం.. ఇంత‌లా ఓపెన్ కావ‌టం వెంక‌య్య‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుందేమో?