Begin typing your search above and press return to search.

వెంక‌య్య‌..ఇరిటేష‌న్ మ‌రీ ఎక్కువ అవుతుంది

By:  Tupaki Desk   |   22 Dec 2017 10:21 AM GMT
వెంక‌య్య‌..ఇరిటేష‌న్ మ‌రీ ఎక్కువ అవుతుంది
X
సుదీర్ఘ‌కాలం పాటు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా అనుభ‌వం ఉన్న బీజేపీ సీనియ‌ర్ నేత వెంక‌య్య‌నాయుడిక రాజ్య‌స‌భ ఎలా జ‌రుగుతుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం ఏమీ లేదు. మొన్న కాక నిన్న ఏమీ ఆయ‌న స‌భ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌లేదు. కాక‌పోతే.. ఆ మ‌ధ్య వ‌ర‌కు స‌భ్యుల‌తో పాటు ఉన్న ఆయ‌న ఇప్పుడు ఉప‌రాష్ట్రప‌తి హోదాలో ఛైర్మ‌న్ సీట్లో కూర్చున్నారు. ఇంత‌కు మించి పెద్ద మార్పు లేదు.

పాత‌కాల‌పు వాస‌న‌లు ఉన్న వెంక‌య్య‌కు.. రాజ‌కీయ పార్టీలు.. అందునా విప‌క్షాలు ఎలా వ్య‌వ‌హ‌రిస్తాయో వెంక‌య్య‌కు కొట్టిన పిండే. మ‌రి.. అలాంట‌ప్పుడు స‌భ‌కు అంత‌రాయం క‌లిగేలా స‌భ్యులు నినాదాలు.. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తుంటే.. నిర్వికారంగా ఉండాల్సిన ఛైర్మ‌న్ సీటులో కూర్చున్న వెంక‌య్య‌.. త‌న‌లోని భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేక‌పోతున్నార‌న్న విమ‌ర్శలు ఎక్కువ అవుతున్నాయి.

నిజ‌మే.. స‌భ‌ను ముందుకు సాగ‌కుండా కాంగ్రెస్ నేత‌లు అదే ప‌నిగా చిరాకు తెప్పించేలా స‌భ‌కు అంత‌రాయం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఛైర్మ‌న్ హోదాలో ఉన్న వ్య‌క్తికి ఇబ్బందే. కానీ.. విప‌క్ష నేత‌లు అలా వ్య‌వ‌హ‌రించ‌టం ఇప్ప‌టికిప్పుడు కొత్త‌గా వ‌చ్చిందేమీ కాదు. ఆ మాట‌కు వ‌స్తే.. ఛైర్మ‌న్ స్థానంలోఉన్న వెంక‌య్య‌.. మొన్నామ‌ధ్య ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ చేస్తే.. నో.. చెప్ప‌రంటే చెప్ప‌రంటూ తెగేసి చెప్పిన వైనం గ‌తంలో ఏ ఉప‌రాష్ట్రప‌తి చేయ‌లేద‌న్న‌మాట వినిపిస్తోంది.

మ‌రి అలాంట‌ప్పుడు విప‌క్షాలు చేసే ర‌చ్చ విష‌యంలో స‌హ‌నంతో.. ఓర్పుతో వ్య‌వ‌హ‌రించి.. వారిని బుజ్జ‌గించి స‌భ‌ను న‌డ‌పాలే కానీ.. బెత్తం ప‌ట్టుకున్న స్కూల్ మాష్టారు మాదిరి క‌న్నెర్ర చేయ‌టం.. ముఖాన్ని సీరియ‌స్ గా పెట్టుకోవ‌టం అంత బాగోదు. ప్ర‌జాస్వామ్యానికి దేవాల‌యం లాంటి స‌భ‌లో స‌భ్యులు విలువ‌ల్ని పాటించాలి. కానీ.. ఆ ప‌ని స‌భ్యులు చేయ‌న‌ప్పుడు.. వారిని దారికి తెచ్చే బాధ్య‌త స‌భానాయ‌కుడిది. అదెలా చేస్తార‌న్న‌ది ఆ స్థానంలో కూర్చునే నేత‌ను అనుస‌రించి ఉంటుంది. అయితే.. ఇంట్లోనో.. సొంతోళ్ల మీద‌నో చూపించే అస‌హ‌నం.. చిరాకు చ‌ట్ట‌స‌భల్లోని నేత‌ల మీద ప్ర‌ద‌ర్శించ‌టం బాగుండద‌న్న మాట వినిపిస్తోంది.

వెంక‌య్య తీరును విమ‌ర్శించే వారికి త‌గ్గ‌ట్లే.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచే వారూ ఉన్నారు. స‌భ్యుల తీరు కార‌ణంగా కీల‌క‌మైన బిల్లుల‌పై చ‌ర్చ‌లు జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే..తన అస‌హ‌నం మీద‌న త‌న‌దైన రీతిలో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు వెంక‌య్య‌. రోజులు గ‌డిచే కొద్దీ ప‌రిస్థితులు అధ్వానంగా త‌యార‌వుతున్నాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వెంకయ్య ఆవేద‌న‌లో నిజం ఉంది. అదే సమ‌యంలో.. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ను ఉద్దేశించి గుజ‌రాత్ ఎన్నిక‌ల వేళ.. ప్ర‌ధానిగా ఉన్న మోడీ చేసిన ఆరోప‌ణ‌ల విష‌యంలో విప‌క్షాల ఆందోళ‌న‌లోనూ వాస్త‌వం ఉంద‌న్న విష‌యాన్ని వెంక‌య్య ఎందుకు అర్థం చేసుకోరో..?