Begin typing your search above and press return to search.

పురందీశ్వ‌రికి బెర్త్ ద‌క్క‌కుండా వెంక‌య్య చెక్ పెట్టారా?

By:  Tupaki Desk   |   25 Aug 2017 12:04 PM GMT
పురందీశ్వ‌రికి బెర్త్ ద‌క్క‌కుండా వెంక‌య్య చెక్ పెట్టారా?
X
భారతీయ జనతా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూతన అధ్యక్షుని ఎంపిక ఆధిపత్య పోరాటానికి, అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌కు వేదిక‌గా మారినట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. పార్టీలో సీనియారిటీ, సామర్థ్యం, జాతీయ నాయకత్వానికి విధేయునిగా ఉండటం లాంటి అంశాలు పక్కకుపోయి నాయ‌కుల అభిప్రాయాల‌కు పెద్ద పీట వేయ‌డం అనే ట్రెండ్‌ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఏపీ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబు ప‌దవీ కాలం ముగిసిన నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో కొత్త నేతను అధ్యక్షునిగా నియమించాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - మాజీ కేంద్ర మంత్రి పురందీశ్వ‌రికి ఈ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని ఒక ద‌శ‌లో బీజేపీ అగ్ర‌నేత‌లు డిసైడ్ అయ్యార‌ని స‌మాచారం. అయితే దీనికి కేంద్ర మాజీ మంత్రి వెంక‌య్య కార‌ణంగా బ్రేకులు ప‌డ్డాయ‌ని కొంద‌రు అంటున్నారు.

కుటంబ‌, సిద్ధాంత‌ప‌ర‌మైన వైరుధ్యాల కార‌ణంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు - దివంగ‌త ఎన్టీఆర్ త‌న‌య పురందీశ్వ‌రి అనేక అంశాల‌పై విబేధిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి - ఏపీలో అవినీతి - పోల‌వ‌రం వంటి అంశాల‌పై పురందీశ్వ‌రి గ‌ట్టిగానే త‌న వ్య‌తిరేక‌త‌ను వినిపించారు. పార్టీ నేత‌ల‌తో పురందీశ్వ‌రీ మమేకం అవుతున్న తీరును చూసిన బీజేపీ నేత‌లు ప్ర‌స్తుతం ప‌ద‌వి నుంచి దిగిపోతున్న హ‌రిబాబు స్థానంలో చిన్న‌మ్మ‌ను ఎంపిక చేయాల‌ని డిసైడ‌యిన‌ప్ప‌టికీ చివ‌రి నిమిషంలో బ్రేకులు ప‌డ్డాయ‌ని స‌మాచారం. బీజేపీ అగ్ర‌నేత‌గా ఉన్న‌ వెంక‌య్య స‌హాయంతో ఆ పార్టీలోని పలువురిని ప్ర‌భావితం చేసి పురందీశ్వ‌రి నియామ‌కం కాకుండా చేశార‌ని ఆమె స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి. ఆమె అధ్యక్షురాలైతే రెండు పార్టీల మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తింటాయ‌ని టీడీపీ ప్ర‌చారం చేయ‌డం వ‌ల్లే - బీజేపీ పెద్ద‌ల‌కు చెప్పించ‌డం వ‌ల్లే ఏపీ అధ్యక్ష స్థానం క‌ట్టబెట్ట‌డం వెన‌క్కుపోయింద‌ని చెప్తున్నారు. అందుకే వెంక‌య్య‌నాయుడు స‌న్మాన స‌మ‌యంలో అయినా, రాష్ట్ర ప‌ర్య‌ట‌న విష‌యంలో అయినా పురందీశ్వ‌రి దూరంగా ఉంటున్నార‌ని చెప్తున్నారు. టీడీపీ నాయ‌క‌త్వం కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ రూపంలో తీసుకుంటున్న నిర్ణ‌యాలు కూడా అధ్యక్షుని ఎంపికపై పడటంతో భాజపా జాతీయ నాయకత్వానికి ఏమి చేయాలో పాలుపోవటం లేదని, త‌ద్వారా అధికార పార్టీ అయి ఉండి కూడా అధ్య‌క్షుడిని ఎంపిక చేసుకోలేక‌పోతోంద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

గ‌తంలో సీనియ‌ర్ నేత సోము వీర్రాజు విష‌యంలోనూ టీడీపీ ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించింద‌ని బీజేపీలోని కొంద‌రు నేత‌లు ప్ర‌స్తావిస్తున్నారు. మిత్రపక్షమని కూడా చూడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడును, ప్రభుత్వ పనితీరును వీర్రాజు తీవ్రంగా విమర్శించటం, పలు ఆంశాలపై విరుచుకుపడ్డారు. వీర్రాజుకు మద్దతుగా పార్టీలోని పురంధేశ్వరి - కావూరి సాంబశివరావు - కన్నా లక్ష్మీనారాయణ - మంత్రి మాణిక్యాలరావుతో పాటు అనేక మంది నిలిచారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపైన - ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుపైన విమర్శలు - ఆరోపణలు చేయటం సముచితం కాదంటూ పార్టీలోనే ఉన్న మరో వర్గం వీర్రాజు వ్యవహారశైలిని వ్యతిరేకింది. ఈ వర్గంలో అప్ప‌టి కేంద్రమంత్రి వెంకయ్య నాయడు, మంత్రి కామినేని శ్రీనివాస్ - అధ్యక్షుడు హరిబాబు తదితరులున్నట్లు పార్టీలో ప్రచారం సాగింది. ఈ వర్గం జాతీయ నాయకత్వానికి పలుమార్లు ఫిర్యాదు కూడా చేసినట్లు వార్త‌లు వ‌చ్చాయి. త‌ద్వారా వీర్రాజు నియామ‌కం ఆగిపోయింది. అదే సీన్ మ‌ళ్లీ జ‌రిగింద‌ని అంటున్నారు.

మ‌రోవై తెలంగాణ విష‌యాన్ని కాస్తంత ప‌క్క‌న‌బెడితే... న‌వ్యాంధ్ర‌లో ఆ పార్టీ ఇప్పుడున్న దానికంటే కూడా మ‌రింత‌గా మెరుగుప‌డాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో నవ్యాంధ్ర‌లో పార్టీ బ‌లోపేతం కోసం ఆ పార్టీ నేత‌లు ఓ కొత్త నినాదాన్నే అందుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 29న విజ‌య‌వాడ రానున్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఇక్క‌డే తిష్ట వేయ‌నున్నారు. ఈ సందర్భంగా పార్టీ కొత్త‌గా రూపొందించిన నినాదానికి షా తెర తీస్తార‌ని స‌మాచారం. ఈ స‌మ‌యంలో భ‌విష్య‌త్‌ లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా? లేక నూత‌న మైత్రి ఏర్ప‌డుతుందా అనే అంశంపై క్లారిటీ వ‌స్తుంద‌ని స‌మాచారం.