Begin typing your search above and press return to search.

పుస్తకావిష్కరణలోనూ అదే గోలా వెంకయ్య?

By:  Tupaki Desk   |   14 Sep 2015 3:55 AM GMT
పుస్తకావిష్కరణలోనూ అదే గోలా వెంకయ్య?
X
ఎంత రాజకీయ నాయకుడైనా.. కొన్ని సందర్భాల్లో రాజకీయాల గురించి ప్రస్తావించకుండా ఉంటే హుందాగా ఉంటుంది. పుస్తకావిష్కరణ సభకు వచ్చిన వెంకయ్య.. బుద్ధిగా పుస్తకాన్ని ఆవిష్కరించేసి పుస్తకంలోని అంశాల గురించి నాలుగు మాటలు చెబితే బాగుండేది. కానీ.. పుస్తకం గురించి తక్కువ.. రాజకీయం గురించి ఎక్కువ చెప్పేసి అందరిని బోర్ కొట్టించటమే కాదు.. ఆ కార్యక్రమంలో హాజరైన పలువురికి ఇబ్బందికరంగా మారారు.

ఆదివారం పార్క్ హోటల్ లో రక్షణ శాఖ అధికారి వేద్ వీర ఆర్య రచించిన ‘‘ది క్రానాలజీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా’’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విచ్చేశారు. కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి పుస్తకావిష్కరణకు రావటం మంచిదే. ఈ కార్యక్రమానికి డిఫెన్స్ కు సంబంధించిన పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ సంస్కృతి గురించి.. కుహనా లౌకికవాదుల గురించి ప్రస్తావిస్తూ. ఆ విషయాల్ని అప్రమత్తం చేస్తూ తాజా పుస్తకం ఉందంటూ వ్యాఖ్యానించారు.

వామపక్ష భావజాలం.. పాశ్చాత్య సంస్కృతి కలిపి ఇండియన్ కల్చర్ ను దెబ్బ తీశాయన్న ఆవేదన వ్యక్తం చేయటం.. అందుకు కొన్ని ఉదాహరణలు చెప్పటం బాగానే ఉంది. సమస్యల్లా ఎక్కడ వస్తుందంటే.. ఈ అంశాలతో పాటు సమకాలీన రాజకీయాలు ప్రస్తావించినప్పుడు. కేంద్రమంత్రి హోదాలో ఉండటంతో వెంకయ్యను ఎవరూ అడ్డుకునే వారు ఉండరు.

తనకు లభించిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా మోడీ సర్కారు మీద విమర్శల చేసే వారిని వదిలిపెట్టకుండా విమర్శించేయటమే అసలు ఇబ్బంది. తాజా పుస్తకావిష్కరణలోనూ వెంకయ్య తీరు ఇదే రీతిలో ఉంది. ఆర్థిక సంక్షోభంలో చైనా లాంటి దేశాలు దెబ్బ తిన్నా.. భారత్ మాత్రం మెరుగైన వృద్ధిరేటు సాధిస్తోందని చెబుతూ.. అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పుకొచ్చారు.

పవర్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏమీ చేయలేదని.. ఇప్పుడు తాము చేస్తుంటే అడ్డుకుంటుందని చెబుతూ.. పార్లమెంటును అడ్డుకోవటాన్ని ప్రస్తావించేశారు. పార్లమెంటును అడ్డుకోవటం ద్వారా దేశాన్ని మోడీ ఏమీ చేయలేరని చెబుతూ.. ఆయన ఐదేళ్లు ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పుకొచ్చారు.

అసోం.. పంజాబ్.. రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. కర్ణాటక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విఫలమైందని గుర్తు చేస్తూ.. రాజకీయాల గురించి నాన్ స్టాప్ గా మాట్లాడేశారు. ఒక్క కేంద్ర రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడకుండా రైతుల ఆత్మహత్యలు.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో కాంగ్రెస్ నేతలు అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేశారు. ఇలా పుస్తకావిష్కరణ సభకు వచ్చిన వెంకయ్య పుస్తకం గురించి తక్కువ.. రాజకీయం గురించే ఎక్కువ మాట్లాడేశారు. అధికారంలో ఉన్న వ్యక్తులు ఏం చేసినా ఎవరూ ఏమీ అనలేరు కాబట్టి.. మిగిలిన వారూ చూస్తుండిపోయే పరిస్థితి.