Begin typing your search above and press return to search.

రాజ్యసభలో మరో 5 భాషలు

By:  Tupaki Desk   |   18 July 2018 5:10 PM GMT
రాజ్యసభలో మరో 5 భాషలు
X
దేశంలో వివిధ ప్రాంతాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎంపీల్లో కొందరు హిందీ - ఇంగ్లిష్ మాట్లాడలేనివారుంటారు. వారి కోసం ఆయా భాషల నుంచి అనువాద సౌకర్యం ఇప్పటికే ఉంది. ఇలా 17 భారతీయ భాషలకు అనువాద సౌకర్యం ఉంది. తాజాగా మరో అయిదు భాషలకు ఆ సౌకర్యం కల్పించారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు బుధవారం ప్రకటించారు. అంటే.. రాజ్యసభలో ఇక నుండి 22 భారతీయ భాషలలో మాట్లాడొచ్చన్నమాట.

ఇంతకుముందు అస్సామీ - బెంగాలీ - గుజరాతీ - హిందీ - కన్నడ - మలయాళం - మరాఠీ - ఒరియా - పంజాబీ - తమిళ్ - తెలుగు - ఉర్దూ భాషలకు ఈ సౌకర్యం ఉంది. ఇకనుండి డోగ్రి - కశ్మీరి - కొంకణి - సంతాలి - సింధి భాషలకు కూడా అనువాద అవకాశం కల్పించారు. అంటే ఆయా భాషలకు చెందిన ఎంపీలు తమ సొంత భాషల్లో మాట్లాడొచ్చు.

అయితే, సభ్యులెవరైనా సొంత భాషలో మాట్లాడాలంటే తొలుత సెక్రటేరియట్‌ లోని ఇంటర్‌ ప్రెటర్‌ కు నోటీసును ఇవ్వాలి. అప్పుడు వారికి ట్రాన్సలేషన్ సౌకర్యం కల్పిస్తారు. అయితే.. కొత్తగా అవకాశం కల్పించిన అయిదు భాషల్లో మొదట్లో కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సొంత భాషల్లో మాట్లాడేవారి వేగాన్ని అందుకోలేక అనువాదంలో లోపాలు జరగొచ్చని చెబుతున్నారు. కాగా ఈ లేటెస్ట్ అప్‌ డేట్‌ పై బీజేపీ నేత సుబ్రమణియం స్వామి మాట్లాడుతూ.. సంస్కృభాషను కూడా ఈ లిస్టులో చేర్చాలని కోరారు.